కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) వల్ల ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికుల ఉచిత బస్సు ప్రయాణాల కోసం ప్రత్యేక కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనికోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఆదివారం ప్రజా భవన్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులతో కలిసి ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఆర్టీసీ బలోపేతానికి, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గతంలో ఉన్న బకాయిలు గణనీయంగా తగ్గాయని ఆయన వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ పీఎఫ్ బకాయిలను 1400 కోట్ల రూపాయల నుంచి 660 కోట్లకు, సీసీఎస్ బకాయిలను 600 కోట్ల రూపాయల నుంచి 373 కోట్లకు తగ్గించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మహిళలు 255 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారని, ఇది మహిళా సాధికారతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా పీఎం ఈ-డ్రైవ్ కింద భారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరానికి 2800 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు కలిపి 100 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వీటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ రంగంపై సమీక్ష సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ఇప్పటికే 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసిందని, గురుకులాల మెస్, కాస్మొటిక్ చార్జీల కోసం 152 కోట్ల రూపాయలను విడుదల చేశామని వివరించారు. నాయీ బ్రాహ్మణ, రజక వృత్తిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి బిల్లులను క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also: బీఆర్ఎస్ లో ఉంటూ పార్టీకే నమ్మకద్రోహం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి
Follow Us On: Instagram


