Mobile Popup Ad
Mobile Popup Ad

‘మా చెరువును కాపాడండి’.. కొత్తగూడెంలో రైతుల రాస్తారోకో

కలం, ఖమ్మం బ్యూరో : తమ జీవనాధారమైన చెరువును అక్రమంగా ఆక్రమిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన రైతులు, గ్రామస్థులు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్‌లో ఉన్న ఎర్రగుంట చెరువు (Yerragunta Lake) ఆక్రమణలను నిరసిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

‘మా చెరువును కాపాడండి.. ఆక్రమణదారులను శిక్షించండి’ అంటూ నినాదాలు చేసిన రైతులు, కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా చెరువు భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆక్రమణల కారణంగా భవిష్యత్తులో సాగునీటి కొరత ఏర్పడి వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అధికారుల నిర్లక్ష్య వైఖరే తమను ఆందోళన బాట పట్టించిందని రైతులు మండిపడ్డారు. చెరువును కాపాడేందుకు వెంటనే ఆక్రమణలను తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

రైతులు, గ్రామస్థులు ఒక్కసారిగా రహదారిపై ధర్నాకు దిగడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ లారీలు, బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, ఉద్యోగులు గంటల తరబడి రోడ్డుపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు.

ఎర్రగుంట చెరువు (Yerragunta Lake) ఆక్రమణల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తక్షణమే విచారణ జరిపిస్తామని స్పష్టం చేయడంతో గ్రామస్థులు తమ ఆందోళనను విరమించారు. ఆ తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రైతులు మాత్రం చెరువు ఆక్రమణలను పూర్తిగా తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

Read Also: నిజామాబాద్ లో ‘హస్త’వ్యస్తం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>