జీఆర్ఎంబీ అజెండాపై వినోద్‌కుమార్‌, గంగుల అల్టిమేటం

కలం, కరీంనగర్ బ్యూరో : ఈనెల 18న హైదరాబాద్‌లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు 18వ సమావేశ ఎజెండా (GRMB Agenda) నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నగరంలోని గంగుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే ప్రాజెక్టులను నిర్మించినట్లు స్పష్టం చేశారు.

​తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎజెండా పంపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరడం, దాన్ని ఎజెండాలో పెట్టడం సరికాదన్నారు. ​తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడుగుతుంటే ఎంపీలు మౌనం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ఎంపీలందరూ దిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, జీఆర్ఎంబీ ఎజెండా నుంచి ఆ ప్రాజెక్టుల తొలగింపునకు పార్లమెంట్ వేదికగా గట్టిగా కొట్లాడాలని సూచించారు. ఒకవేళ అనుమతులు రద్దు చేస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈనెల 18లోగా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ ఎజెండా నుంచి తొలగించాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బారసా నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>