కలం, నిజామాబాద్ బ్యూరో : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో అధికార కాంగ్రెస్ (Nizamabad Congress) లోని వర్గ విభేదాలు క్యాడర్ ను అయోమయానికి గురిచేస్తున్నాయి. జిల్లాలో 9 నియోజకవర్గాల పరిధిలో నాలుగు చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా ఐదు చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జ్ లు ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నచోట పెద్దగా ఇబ్బందులు లేవు. ఇన్ చార్జ్ లు ఉన్నచోటనే వర్గ విభేదాలు నెలకొన్నాయి.
ఇటీవల నిజామాబాద్ అర్బన్ పరిధి లోని డివిజన్లకు అధ్యక్షులను నియమించగా, రెండు రోజుల్లో రద్దు చేస్తూ ఏకంగా గాంధీభవన్ నుంచే ప్రకటన వెలువడడంతో పార్టీలో అయోమయ పరిస్థితులను తెలియజేస్తున్నది. అధికారంలో ఉన్నామనే భావన తప్ప క్యాడర్ పెద్దగా సంతృప్తిగా లేదనేది బహిరంగ రహస్యమే. రెండున్నరేళ్లలో ప్రభుత్వ, పార్టీ పదవులు పొందిన నేతలే సంతృప్తిగా ఉన్నారు. పార్టీ క్యాడర్ లో అసంతృప్తి చల్లారలేదు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాల్లో గెలిచినా, కానీ రాబోయే జెడ్పీ ఎన్నికల్లో గెలవడం అంత సులభంగా ఉండదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
అంతర్గత విభేదాలు
జిల్లోని నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చేవిధంగా ఉంటున్నాయని సొంత నేతలే చర్చించుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు చీఫ్ (Mahesh Kumar Goud) సొంత జిల్లా అయినా.. పార్టీ సంస్థాగతంగా అంతా బలంగా ఏమీ లేదు. జిల్లా కార్యవర్గం ఏర్పాటైనా.. ఇంకా మండల కార్యవర్గాలు నియమించలేదు. గత నవంబరులో జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం చేసినప్పటికి పూర్తిస్థాయి కార్యవర్గాలు మాత్రం ఏర్పాటు కాలేదు. నియోజకవర్గ స్థాయిలో నేతల మధ్య విభేదాల కారణంగా జిల్లా, మండల పార్టీ కార్యవర్గాలు కార్యరూపం దాల్చడంలేదు.
నియోజక వర్గ ఇన్ చార్జ్ లకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య అంత సఖ్యత లేదనేది స్పష్టమవుతుంది. అధికార, పార్టీ కార్యక్రమాలలో ఎవరికి వారే పాల్గొంటుండడం విభేదాలను తెలియస్తున్నది. ఇటీవల నిజామాబాద్ అర్బన్ డివిజన్ కమిటీల్లో సీనియర్ నేతలను ఎవరిని సంప్రదించకుండా డివిజన్ అధ్యక్షులను నియమించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందింది. దీంతో డివిజన్ అధ్యక్షుల నియామకాలను పార్టీ చీఫ్ రద్దు చేశారు. నిజామాబాద్ అర్బన్ లో మాత్రం పార్టీ క్యాడర్ అయోమయంలో నెలకొంది.
పార్టీకి దూరంగా సీనియర్లు
గతంలో పార్టీ పదవుల్లో పనిచేసిన నేతలు ఇటీవల దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందడంలేదని బహిరంగంగానే చెబుతున్నారు. నిజామాబాద్ అర్బన్ పరిస్థితి మరింత దారుణంగా ఉందని, సీనియర్లను, ఇతర పదవులను కలిగిన నేతలను పిలవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం వాట్సప్ లో మాత్రమే మెసేజ్ లు పెడుతున్నా రని, గతంలో మాదిరి ఫోన్లు చేసి పిలవడంలేదనే పలువురు నేతలు వాపోతున్నారు. ఇటీవల నియమించిన డివిజన్ అధ్యక్షుల నియామకంలోనూ నగరానికి చెందిన సీనియర్ నేతలు ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా పార్టీకి సంబంధంలేని వ్యక్తులను నియమించినట్లు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదులు వెళ్లాయి.
పార్టీకి మూడేళ్లపాటు సేవ చేసిన వారినే డివిజన్ అధ్యక్షులుగా నియమించాలని పీసీసీ ప్రకటన విడుదల చేసిందంటే అర్బన్ డివిజన్ కమిటీలలో సీనియర్లను కాదని జూనియర్లను నియమించినట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన కార్పొరేటర్ అభ్యర్థులు తాము చెప్పిన వారికే డివిజన్ అధ్యక్షుడిగా నియమించాలని పీసీసీ చీఫ్ ని కోరడంతో డివిజన్ అధ్యక్షుల నియామకానికి బ్రేకులు పడ్డాయి.
ఇన్ చార్జ్ లు ఉన్నచోట విభేదాలు
జిల్లాలో బోధన్, నిజామాబాద్ రూరల్ లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉండగా, బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండలలో నియోజకవర్గ ఇన్ చార్జ్ ల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్, బాల్కొండ, ఆర్మూర్ లో పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. బాల్కొండ ఇన్ చార్జ్ గా సునీల్ రెడ్డి ఉండగా, అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, పాల్గొంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం రాష్ట్ర కార్పొరేషన్ పదవుల్లోని నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఆర్మూర్ లోనూ సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్ నేతల మధ్య సఖ్యత లేక ఎవరికివారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరు నేతలను సమన్వయం చేసి పార్టీ పదవులు ఇచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్న క్షేత్రస్థాయిలో సాధ్యం కావడంలేదు. నిజామాబాద్ రూరల్ లోనూ పార్టీ పదవుల విషయంలో స్థానిక ఎమ్మెల్యేకు పార్టీ జిల్లా అధ్యక్షుడికి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం సాగుతున్నది.
కామారెడ్డి తలనొప్పి
కామారెడ్డిలో తలనొప్పిగా మారినట్టు పార్టీలోనే చర్చ జరుగుతున్నది. దీనికి కారణం సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి మధ్య విభేదాలే కారణంగా ఉంది. రెండువర్గాలుగా విడిపోయి ఎవరికి వారే పోటాపోటీగా ప్రెస్ మీట్ లు, కార్యక్రమాలతో హడావిడి చేయడమే కాకుండా పరస్పర ఫిర్యాదులు, ఆరోపణలు క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదులు వివరణల దాకా వెళ్లాయి. చివరికి వివాదం సద్దుమణిగిందని పార్టీ క్రమశిక్షణా కమిటీ ప్రకటించింది.. కానీ ఇలా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి. రెండు, మూడు వర్గాలు విభేదాలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు వెంటనే చక్కదిద్దకపోతే పార్టీ చాలా పరిణామాలు ఎదుర్కొని నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: అమెరికా పౌరసత్వం వదిలి.. 94 ఏళ్ల బామ్మ సంచలన నిర్ణయం!
Follow Us On: X(Twitter)

