ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలనం చోటు చేసుకున్నది. వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh)ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. జోగి రమేశ్ అనుచరుడు ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు.
కేసు నేపథ్యం ఇదే..
గత సంవత్సరం (2023) చివర్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం వల్ల పలు మరణాలు సంభవించాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తాగిన తర్వాత అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. దర్యాప్తులో నకిలీ మద్యం ఉత్పత్తి, సరఫరా జరుగుతోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నం, ములకలచెరువు, విజయవాడ ప్రాంతాల్లో దాడులు జరిపి నకిలీ మద్యం ఫ్యాక్టరీలను గుర్తించారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అద్దేపల్లి జనార్దనరావు (A1)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వాంగ్మూలంలోనే మాజీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) పేరు మొదటిసారి బయటపడింది.
రమేశ్‌పై జనార్దనరావు వాంగ్మూలం
‘జోగి రమేశ్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారీకి నడుం బిగించాను. ఆయన రూ.3 కోట్లు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని నమ్మకం కలిగించారు. దీంతో 2023లోనే ఇబ్రహీంపట్నంలో మద్యం తయారీని ప్రారంభించాం.’ అని రాతపూర్వకంగా జనార్దన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. జనార్దనరావు వాంగ్మూలంలో ములకలచెరువులో జయచంద్రారెడ్డి అనే వ్యక్తి సహకారంతో ఈ మద్యం తయారీ మొదలైందని కూడా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు కూడా పరోక్షంగా ఉన్నారనే అంశంపై సిట్ దృష్టి సారించింది.
సీసీటీవీ ఆధారాలు
జనార్దనరావు, రమేశ్‌ల మధ్య సంబంధాన్ని నిర్ధారించేందుకు సిట్ కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 23న ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దనరావు, జోగి రమేశ్‌ను ఆయన ఇంట్లో కలిశాడనే వాంగ్మూలాన్ని ధృవీకరించేందుకు సీసీ కెమెరా ఫుటేజీ సేకరించారు. దాంతో జోగి రమేశ్ పై ఆరోపణలు బలపడటంతో సిట్ ఆయనను అరెస్ట్ చేసింది. విచారణ ప్రక్రియను కోర్టు ఆదేశాల మేరకు పూర్తిగా వీడియో రికార్డ్ చేశారు. ఈ కేసులో మరికొందరు రాజకీయ నేతల పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది.
వైసీపీ ఏమంటోంది?
జోగి రమేశ్ అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగింది. వైసీపీ వర్గాలు మాత్రం యథావిధిగా దీనిని రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెబుతున్నాయి. జోగి రమేశ్ 2019లో విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. కోర్టు రమేశ్‌కు రిమాండ్ విధించే అవకాశం ఉంది. సిట్ ఇప్పటికే ఆయన బ్యాంకు లావాదేవీలు, ఫోన్ కాల్ రికార్డులు, సంబంధిత వ్యక్తుల వివరాలు సేకరించినట్టు సమాచారం.
Read Also: జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగ జేఏసీని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు
Follow Us On : Instagram

