బిహార్(Bihar) అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ హత్య జరిగింది. జన్‌సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మద్దతుదారుడు దులార్‌చంద్ యాదవ్(Dularchand Yadav) హత్యకు గురయ్యాడు. కాగా ఈ కేసులో జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అనంత్ సింగ్ పట్నా జిల్లాలోని మొకామా నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దులార్‌చంద్ హత్య అనంతరం ఆయనపై పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం తెల్లవారుజామున బార్హ్‌లోని ఆయన నివాసంపై సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అనంత్(Anant Singh)తో పాటు ఆయన అనుచరులు మణికాంత్ ఠాకూర్, రంజీత్ రామ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురినీ విచారణ కోసం పట్నాకు తరలించారు.
హత్య కేసు నేపథ్యం
ఇటీవల మొకామాలో జన్‌సురాజ్(Jan Suraaj) పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి ప్రచార కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పీయూష్ మామ, పార్టీ కార్యకర్త దులార్‌చంద్ యాదవ్‌పై దుండగులు కాల్పులు జరపగా, ఆయన అక్కడికక్కడే మరణించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం బుల్లెట్ తగిలినప్పటికీ షాక్ కారణంగానే మృతి సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
హత్య ఘటనతో మొకామాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆగ్రహంతో ఉన్న జన్‌సురాజ్ కార్యకర్తలు ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవీ కారుపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. హత్య ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లను అదుపులో పెట్టడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ పట్నా రూరల్ ఎస్పీ విక్రమ్ సిహాగ్‌ను వెంటనే బదిలీ చేసింది. అదేవిధంగా మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది.
దులార్‌చంద్ హత్య అనంతరం జేడీయూ నేత అనంత్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఎస్పీ బదిలీ అయ్యారు. ఈ పరిణామాలతో బిహార్(Bihar) రాజకీయం వేడెక్కింది. ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: నకిలీ మద్యం కేసులో సంచలనం.. వైసీపీ కీలక నేత అరెస్ట్
Follow Us On : Instagram

