జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికల్లో ప్రచార వేడి రోజురోజుకు ఊపందుకుంటున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, మరోవైపు బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంతో రాజకీయం వేడెక్కింది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తుండగా వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడం కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిరుద్యోగ జేఏసీ(JAC) పేరిట కొంతమందిని తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్ నేతలు, నిరుద్యోగ జేఏసీ వాదిస్తోంది.
ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గ పరిధిలోని రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీంతో వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నిరుద్యోగ జేఏసీకి చెందిన మహిళలపై కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత చెలరేగింది.
నిరుద్యోగ జేఏసీ నేతలు వాదన ఏమిటి?
“రాష్ట్రంలో లక్షలాది మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. నియామక ప్రక్రియలు నిలిచిపోయాయి. నిరుద్యోగుల వేదనను ప్రజలకు చెప్పడం మా హక్కు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం” అని ఆరోపించారు. దాడి చేసిన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు?
నిరుద్యోగ జేఏసీ పేరుతో ప్రచారం చేస్తున్నవారు వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ తరఫున పనిచేస్తున్నారని ఆరోపించారు. “ఇది ఎన్నికల ప్రచారం కాదు. ఇవి బీఆర్‌ఎస్ అనుకూల గ్రూపులు. మా అభ్యర్థి పేరును చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు” అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజవకర్గంలో పరిస్థితి పోటాపోటీగా ఉంది. దీంతో బస్తీవాసుల ఓట్లపై అంతా దృష్టి పెట్టారు. ప్రతి ఓటును తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఎవరికి వారు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
Read Also: బీఆర్‌ఎస్ కార్యాలయానికి నిప్పు ..
Follow Us On : Instagram

