Mobile Popup Ad
Mobile Popup Ad

యాదగిరిగుట్ట పాలకమండలి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్

కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ (Yadagirigutta Temple) చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. యాదాద్రి క్షేత్రానికి తెలంగాణ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ట్రస్ట్ బోర్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ (వైటీడీఏ) మొదటి పాలకమండలి ఈ నెల 11వ తేదీన అధికారికంగా కొలువుదీరనుంది.

దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈఓ భవానీ శంకర్ మీడియాకు వెల్లడించారు. శనివారం ఉదయం 11:37 గంటల శుభ ముహూర్తానికి యాదగిరిగుట్ట (Yadagirigutta) ప్రధానాలయంలోని ‘బంగారు వాకిలి’ ఎదుట నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఆలయ ఈఓ భవానీ శంకర్ నూతన చైర్మన్, బోర్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని ముఖ మండపంలో ఈ వేడుక అత్యంత వైభవంగా సాగనుంది.

ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసిన వెంటనే నూతన పాలకవర్గం తన విధులను ప్రారంభించనుంది. యాదాద్రి కొండపై ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు బోర్డు తన మొట్టమొదటి అధికారిక సమావేశాన్ని నిర్వహించనుంది. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

బోర్డు సమావేశం ముగిసిన అనంతరం చైర్మన్, సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, భవిష్యత్తు కార్యాచరణను మీడియా ద్వారా పంచుకోనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్ర సమగ్ర అభివృద్ధి, స్వయం ప్రతిపత్తిని కాంక్షిస్తూ జూన్ 30న యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత కొలువుదీరుతున్న మొదటి బోర్డు ఇదే కావడంతో భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>