కలం, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని కెనరా బ్యాంకు శాఖలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం (Jangaon canara bank) చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
మంటల కారణంగా బ్యాంకు ఆవరణ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. అగ్నిమాపక సిబ్బంది పొగను బయటకు పంపడంతో పాటు మంటలు మళ్లీ వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
సమాచారం ప్రకారం బ్యాంకులోని గోల్డ్ లోన్‌కు సంబంధించిన పత్రాలు, వ్యవసాయ రుణాలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బ్యాంకు అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది, రికార్డులకు ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అగ్నిమాపక శాఖ, పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.

