హనుమకొండ – కరీంనగర్ 4 లైన్ల హైవే ప్రారంభానికి సిద్ధం

కలం, కరీంనగర్ బ్యూరో: హనుమకొండ – కరీంనగర్ నూతన నాలుగు వరుసల జాతీయ రహదారి (NH 563) ప్రయాణానికి పూర్తిగా సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు వాహనాల ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారని, త్వరలోనే ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో  నిర్మించినట్లు తెలిపారు.

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో..

వరంగల్, హనుమకొండ నుండి కరీంనగర్ వరకు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా జాతీయ రహదారి (Hanamkonda-Karimnagar Highway)ని తీర్చిదిద్దారు. దీనివల్ల ప్రయాణ సమయం గంట నుండి 45 నిమిషాలకు తగ్గుతుంది. 68 కిలోమీటర్ల మేర అధునాతన సాంకేతికతతో సీసీ కెమెరాలు, సోలార్ లైట్లు, ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించే అత్యవసర భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. ఈ రహదారిపై 9 భారీ ఫ్లైఓవర్లు/వంతెనలు, 23 చిన్న వంతెనలు, 25 అండర్‌పాస్‌లను నిర్మించారు. అంతేకాకుండా శంకరపట్నం, మానకొండూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను అందుబాటులోకి తెచ్చారు.

ప్రజల కల నిజం చేసిన బండి సంజయ్..

ప్రజలు ఎన్నో ఏళ్లుగా కంటున్న కలను కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజం చేశారని సునీల్ రావు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ గత ఏడు సంవత్సరాలుగా గ్రామాలు, నగరాల అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయల కేంద్ర నిధులు తీసుకువచ్చారని తెలిపారు. కరీంనగర్ నుండి జగిత్యాల వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2,000 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని, రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రహదారిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. కరీంనగర్ నగర రూపురేఖలు మార్చేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిధులతో పాటు యూసీఎఫ్ (UCF) పథకం కింద రూ.840 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు.

​మిగిలిన సౌకర్యాలు పరిష్కరిస్తున్నాం..

అమృత్ 1, 2 పథకాల ద్వారా నిధులు తేవడంతో పాటు, యూడీఎఫ్ (UDF) కింద రూ.230 కోట్లు (రూ.180 కోట్లు + రూ.50 కోట్లు), యూఐడీఎఫ్ (UIDF) కింద మరో రూ.30 కోట్లు తీసుకువచ్చి నగరంలో మిగిలిపోయిన మౌలిక సమస్యలను పరిష్కరిస్తున్నట్లు సునీల్ రావు వివరించారు. ​రాబోయే 3 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్  నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని స్పష్టం చేశారు. కరీంనగర్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు జిల్లా ప్రజల పక్షాన యాదగిరి సునీల్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>