కలం, హనుమకొండ : కుల, మత, వర్గ, లింగ వివక్షతలను నిర్మూలించడంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను తొలగించి పేదరిక నిర్మూలన కోసం భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేపడతామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ (Manda Krishna) మాదిగ ప్రకటించారు. రాజకీయంగా తమకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ లేరని స్పష్టం చేశారు.
మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఎంఆర్ఎస్పీ, ఎంఎస్పీ జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంఆర్ఎస్పీ జెండాను ఆవిష్కరించి సదస్సును ప్రారంభించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం చిన్న గ్రామంలో ప్రారంభమైన ఉద్యమం 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం దేశాన్ని కదిలించి విజయం సాధించిందని మంద కృష్ణ (Manda Krishna) మాదిగ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణ అమలుతో విద్య, ఉద్యోగ రంగాల్లో దాని ఫలితాలు అందుతున్నాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ల పెంపు కోసం కూడా పోరాడామని గుర్తుచేశారు.
దేశంలో నేటికీ కుల వివక్ష కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న దళితులు సైతం అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వ్యవస్థ రద్దు కావాలని, మత విద్వేషాలు, లింగ–వర్గ వివక్ష తొలగాలని, పేదరికం అంతం కావాలని పిలుపునిచ్చారు. గౌతమ బుద్ధుడు నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వరకు మహనీయులు కలలుగన్న నూతన సమాజ నిర్మాణమే తమ తదుపరి లక్ష్యమన్నారు.
ఇందులో భాగంగా అక్టోబర్ 7న అమరావతిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1200 మండలాల నూతన MRPS–MSP కమిటీల జాతీయ సదస్సు నిర్వహించి ప్రత్యక్ష పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. సదస్సులో MRPS జాతీయ కోర్ కమిటీ చైర్మన్ డా. మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ అధికార ప్రతినిధి డా. వై.కె. విశ్వనాథ్ మాదిగ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి మాదిగ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సొట్ట నరేంద్రబాబు మాదిగ, MRPS మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. గోవిందు నరేష్ మాదిగ, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్ మాదిగ పాల్గొన్నారు.

