కలం, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట (Dammapeta) మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహంలో నెలకొన్న తాగునీటి సమస్యపై డిప్యూటీ కలెక్టర్ (ట్రైనీ), తహసీల్దార్ మద్దినేని మురళి(Maddineni Murali) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత మూడు రోజులుగా తాగునీరు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న డిప్యూటీ కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌లో బోరు మోటారు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీరు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని గుర్తించారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఆయన.. గురువారం ఉదయం 11 గంటల్లోగా కొత్త బోరు వేయిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక దృష్టి సారించారని, హాస్టళ్లలో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.
రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను ఉపయోగించొద్దు
విద్యార్థులను రాజకీయ పార్టీ నాయకులతో కలిసి హాస్టల్ నుంచి బయటకు పంపిన ఘటనపైనా డిప్యూటీ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు, సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. హాస్టల్‌లో మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి హెచ్చరించారు.

