విలీన పంచాయతీల సమస్యపై బండి సంజయ్ కీలక హామీ

కలం, ఖమ్మం బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. ఈ పంచాయతీల్లోని గిరిజనులు గత 12 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన బండి సంజయ్‌ను స్థానిక నాయకులు కలిసి విలీన పంచాయతీల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన కన్నాయిగూడెం, గుండాల, యటపాక, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీల ప్రజలు పరిపాలనాపరంగా, భౌగోళికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు.

12 ఏళ్లుగా ఇబ్బందులు

భద్రాచలం (Bhadrachalam) పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ ఈ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో ప్రభుత్వ సేవలు, ఇతర అవసరాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వివరించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వినతిపై స్పందించిన బండి సంజయ్.. ఐదు గ్రామ పంచాయతీల అంశం ఇప్పటికే కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉందని చెప్పారు. భౌగోళిక సామీప్యత, ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ పంచాయతీలను త్వరితగతిన తెలంగాణలో కలిపేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన వారిలో జంగిలి సంపత్, దాసరి బాలకృష్ణ, బండారు వీరభద్రం తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>