Mobile Popup Ad
Mobile Popup Ad

యాదాద్రి వర్తక సంఘాన్ని రద్దు చేయాలంటూ సీఎం‌కు పోస్ట్ కార్డులు!

కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండపైన (Yadadri Temple) కొనసాగుతున్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో స్వామివారి పాదాల చెంత కరపత్రాలను విడుదల చేశారు. ఆలయ పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీని అరికట్టాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ అద్దెతో కొండపైన దుకాణాలు నిర్వహిస్తున్న కొందరు, కొత్తవారికి అవకాశం రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దైవదర్శనానికి వచ్చే భక్తులకు అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తూ నిలువునా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో కొండపై కేవలం 30 నుంచి 40 దుకాణాలు మాత్రమే ఉండేవని, కానీ ప్రస్తుతం 114కు పెంచేశారని కమిటీ సభ్యులు విమర్శించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈ వర్తక సంఘం నిర్వాహకులు ఎలాంటి ఆస్తులు కోల్పోలేదని, కానీ స్థానికులు తమ ఇళ్లు, భూములను త్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

“గత ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో కొండ (Yadadri Temple) కింద నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ, వీరు కొండపైనే దుకాణాలు సాగిస్తున్నారు. ఈ వర్తక సంఘం వల్ల దేవస్థానానికి, భక్తులకు నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. గత నెల మే 31తోనే వీరి గడువు ముగిసినప్పటికీ, మళ్లీ నెల రోజులు గడువు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.” అని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. తక్షణమే ఈ వర్తక సంఘాన్ని రద్దు చేసి, స్థానికులకు ఉపాధి లభించేలా టెండర్లు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కాటబత్తిని ఆంజనేయులు, పల్లపు బాలయ్య, మిర్యాల కృష్ణ, బండ రామస్వామి, గ్యాదపాక బాల నర్సయ్య, పసుపునుటి మురళి, మాటూరి బాలయ్య, దేవపూజ అశోక్, బండి వాసు, దండబోయిన వీరేశ్, బండి అనిల్, గౌడ శ్రీశైలం, కర్రె ప్రవీణ్, స్థానిక యువకులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>