కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రం అప్పనపల్లి సమీపంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పాఠశాల ఆవరణలోనే అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు, స్టేషనరీ అమ్ముతూ నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించాయి. AISF, AIYF, DYFI ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఛాంబర్‌లో నిరసన చేపట్టారు. మార్కెట్‌లో రూ.200 ఉన్న పుస్తకాన్ని రూ.800కి అమ్ముతూ దోపిడీకి పాల్పడుతోందఅని మండిపడ్డారు. తక్షణమే డీఈవో స్పందించి స్కూల్‌లో తనిఖీలు జరిపి, అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్యపుస్తకాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులు వెనక్కి ఇప్పించాలన్నారు. ఇలాంటి దోపిడీ అరికట్టకకపోతే జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.రాజు, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, AIYF జిల్లా కన్వీనర్ రాము, కో కన్వీనర్ మహేష్ బాబు, రామకృష్ణ. DYFI నాయకులు ప్రశాంత్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

