కలం, వెబ్ డెస్క్: కేవలం 20 గ్రాముల టీ పొడి ధర రూ.1 లక్ష. కేజీ టీ పొడి 9 కోట్లపైనే ఉందంటే నమ్మగలరా? వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రపంచంలోనే ఖరీదైన టీ (Most Expensive Tea)గా ‘దా హాంగ్ పావో’ పేరుంది. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతమైన వుయీ పర్వతాల లోయల్లో మాత్రమే ఈ రకమైన టీ పొడి లభిస్తుంది. చైనీస్ భాషలో ‘దా హాంగ్ పావో’ అంటే ‘బిగ్ రెడ్ రోబ్’ అని అర్థం. కేవలం రుచి మాత్రమే కాకుండా దీనికున్న శతాబ్దాల రాజరిక చరిత్ర ప్రపంచంలోనే ఖరీదైన టీగా మార్చాయి.
బంగారం కంటే డిమాండ్
బంగారం కంటే డిమాండ్ ఉన్న ఈ తేయాకు విశేషాల్లోకి వెళితే ఎన్నో విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆర్కిడ్ పూల పరిమళం, తేలికపాటి పొగ వర్ణం, పండ్ల సువాసనలు కలిసి ఉంటాయి. ఈ టీ ప్రతి గుటకలోనూ సహజమైన తీపిదనాన్ని అందిస్తుంది. వుయీ పర్వతాల నిటారైన కొండచరియల మధ్య వందల ఏళ్ల నాటి కేవలం ‘మదర్ ట్రీస్’ (తల్లి చెట్లు) మాత్రమే ఉన్నాయి. ఇవి అరుదైనవి కావడం వల్ల చైనా ప్రభుత్వం వీటిని జాతీయ సంపదగా గుర్తించింది. పాత వేలం పాటల్లో కేవలం 20 గ్రాముల అసలైన దా హాంగ్ పావో తేయాకు ఏకంగా 2,08,000 యువాన్లకు (సుమారు రూ. 1.23 లక్షలు) అమ్ముడుపోయింది. ఒక్క గ్రాము ధర సుమారు 1,400 డాలర్లు (రూ. 1.2 లక్షలు) దాటడంతో బంగారం కంటే 30 రెట్లు ఎక్కువ విలువైంది. ఒక కప్పు టీని తయారు చేయడానికి దాదాపు రూ. 8.5 లక్షలకు పైగా ఖర్చవుతుంది.
చైనా నిషేధం
ఈ అరుదైన తేయాకు రకానికి సంబంధించి షాకింగ్ నిజం ఏమిటంటే.. అసలైన మదర్ ట్రీస్ నుంచి తేయాకును కోయడాన్ని చైనా ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ‘దా హాంగ్ పావో’ పేరుతో లభించేవన్నీ ఆ పురాతన చెట్ల కొమ్మల ద్వారా క్లోనింగ్ చేసి పెంచిన ఇతర మొక్కల నుంచి తయారు చేసినవే. దీంతో శతాబ్దాల చరిత్ర కలిగిన స్వచ్ఛమైన దా హాంగ్ పావో టీ రుచి అనేది ఇకపై ఏ ఒక్కరికీ సాధ్యపడకపోవచ్చు.

