​రేపటి నుండి కరీంనగర్‌లో ఏఐటీయూసీ 4వ మహాసభలు

కలం, ​కరీంనగర్: ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు (AITUC Conference) సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు కరీంనగర్‌లో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నగరం ఎరుపుమయమైంది. సెప్టెంబర్ 6న సర్కస్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభ, పద్మనాయక కళ్యాణ మంటపంలో జరగనున్న ప్రతినిధుల మహాసభ ఏర్పాట్లను ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, ప్యాట్రన్ కలవేన శంకర్ శనివారం పరిశీలించారు.

​ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి, కలవేన శంకర్ మాట్లాడుతూ.. వందేళ్లకు పైగా ఉద్యమ చరిత్ర కలిగిన ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరగడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, బీడీ, చేనేత తదితర రంగాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని కార్మికుల హక్కుల పరిరక్షణకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. కరీంనగర్‌లో జరిగే మహాసభల ద్వారా కార్మిక చట్టాల పరిరక్షణకు, భవిష్యత్ పోరాటాలకు స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి కార్మికులందరూ వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ​ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని తెలిపారు.

​సెప్టెంబర్ 6 న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం నుండి వన్ టౌన్, బస్టాండ్, గీతాభవన్ చౌరస్తా మీదుగా సర్కస్ గ్రౌండ్ వరకు భారీ కార్మిక ప్రదర్శన, ర్యాలీ. అనంతరం సర్కస్ గ్రౌండ్‌లో బహిరంగ సభ, సెప్టెంబర్ 7, 8 పద్మనాయక కళ్యాణ మంటపంలో ప్రతినిధుల మహాసభ నిర్వహించనున్నారు.

ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్, వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి సి. శ్రీకుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, ఏఐటీయూసీ నాయకులు వి.ఎస్. బోస్, ఎం.డి. యూసఫ్, ఎస్. బాల్ రాజ్ తదితరులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి దాదాపు 800 మంది కార్మిక ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతున్నారు.

​ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>