కలం యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో నేడు నిర్వహించిన ‘క్యాచ్ ద రేన్ – సేవ్ ఎవరీ డ్రాప్’ కార్యక్రమ బ్రోచర్‌ను ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటిని సేకరించి భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, వ్యాపార సముదాయాల్లో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు.
వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యను చాలా వరకు అధిగమించవచ్చని తెలిపారు. ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, “ఈరోజు ప్రతి నీటి చుక్కను కాపాడితే రేపటి భవిష్యత్తు సురక్షితం అవుతుంది” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగె రమ్య రాంచందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

