420 హామీలతో మోసం చేసిన శ్రీధర్ బాబు: పుట్ట మధూకర్ ​

కలం, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో 420 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గానికి చెడ్డపేరు తెచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్  (Putta Madhukar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలన, విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంథని పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు.

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ఇన్ని రోజులైనా హామీలు నెరవేర్చకుండా తెలంగాణ సంపదను ఢిల్లీకి తరలిస్తున్నారని మధూకర్ ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్, రూ.5 లక్షల భరోసా కార్డులు, మెగా డీఎస్సీ, 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి వాగ్దానాలను పూర్తిగా విస్మరించారన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించని శ్రీధర్ బాబు, తన తమ్ముడికి మాత్రం పీసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.

​సహజ వనరులు పుష్కలంగా ఉన్న మంథని నియోజకవర్గానికి ఐటీ కంపెనీలు కానీ, పరిశ్రమలు కానీ తీసకురాలేకపోయారని మధుకర్ మండిపడ్డారు. కనీసం సొంత ఊరు ధన్వాడ పాఠశాలలో ప్రాథమిక వసతులు కూడా కల్పించలేకపోయారని విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ఆలయాన్ని, అభివృద్ధి పేరిట మంథనిలో వ్యాపారాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక కాంట్రాక్టర్లను పక్కనపెట్టి హైదరాబాద్‌ కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు మాట్లాడుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి చెక్కులనే ఇస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి కప్పం కట్టడం ఆపి, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>