కలం, కరీంనగర్ బ్యూరో: అధికారం వచ్చిన ప్రతిసారి దుద్దిళ్ల శ్రీధర్ (Sridhar Babu) పోలీసు వ్యవస్థను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని మంథని (Manthani) మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) ఆరోపించారు. పోలీసులలో మార్పు రావాలని పలుమార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలోని కమాన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీజీ టీవీ అధినేత పూదరి సత్యనారాయణ గౌడ్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అభివృద్ధి చెందాలనుకునే వారిని అడ్డుకునే విధంగా మంథని ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో తనపై అనేక కేసులు పెట్టించడంతో పాటు రౌడీషీట్ కూడా తెరిపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న పూదరి సత్యనారాయణ గౌడ్‌పై కూడా అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జూన్ 9న ముత్తారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైతే రామగిరి పోలీసులు పూదరి ఇంటికి రావడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
పూదరి కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కుటుంబ సభ్యులు ఇంట్లో ఒకచోట చేరితే దానిని పోలీసులపై దాడికి కుట్రగా చిత్రీకరించడం సరికాదన్నారు. పూదరి సత్యనారాయణ తల్లిపై కూడా పోలీసులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. సత్యనారాయణను అరెస్ట్ చేసేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారని, 42 రోజులుగా పోలీసులు ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒక్కో బృందంలో పోలీసులు, ఎస్‌ఐలు, సీఐలు, ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ అరెస్ట్ చేయలేకపోయారని విమర్శించారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనర్‌కు సూచనలు చేశామని, ఐపీఎస్ అధికారిగా వ్యవహరించాలని కోరామని తెలిపారు. ఒకవైపు రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు న్యాయస్థానాల నుంచి వ్యాఖ్యలు రావడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని అన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్ట ప్రకారం పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ప్రస్తుత పరిణామాలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామని పూదరి కుటుంబ సభ్యులు చెబుతున్నారని తెలిపారు.
ప్రజలు కోరుకునే అభివృద్ధి చేయకుండా పోలీసుల ద్వారా అణిచివేతకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌పై విమర్శలు చేశారు. ధన్వాడ పాఠశాలలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ, సొంత గ్రామ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై పోరాడితే న్యాయం తమ వైపే ఉంటుందని పూదరి సత్యనారాయణ గౌడ్ నిరూపించారని పుట్ట మధూకర్ పేర్కొన్నారు.

