కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపి నెలలు గడుస్తున్నా.. ఖమ్మం (Khammam) జిల్లాతో పాటు సుమారు సగం జిల్లాల్లో నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. “పంతులమ్మ ఏది?.. ఆయా ఎక్కడ?..” అంటూ పసిపిల్లలు ఎదురుచూస్తుండగా.. “నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో?” అంటూ నిరుద్యోగ మహిళలు ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా వారి నిరీక్షణకు ఇప్పటికీ తెరపడలేదు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, వికారాబాద్, వనపర్తి, నాగర్కర్నూల్, ఖమ్మం, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటికీ నోటిఫికేషన్లు వెలువడకపోవడం నియామక ప్రక్రియలో నెలకొన్న జాప్యానికి నిదర్శనంగా మారింది.
15,982 పోస్టుల భర్తీ ఎక్కడ?
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,982 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, ఆచరణలో మాత్రం ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పలు జిల్లాల్లో నియామకాలు తుది దశకు చేరుకుంటుండగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం అధికారుల ఆమోదం కోసం ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, మధిర, ఖమ్మం రూరల్, కామేపల్లి, తిరుమలాయపాలెం ప్రాజెక్టుల పరిధిలో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,840 పోస్టులకు గాను 124 అంగన్వాడీ టీచర్, 680 ఆయా పోస్టులు.. మొత్తం 804 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలను చూపుతూ అధికారులు కేవలం 113 అంగన్వాడీ టీచర్, 114 ఆయా పోస్టులకు మాత్రమే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇన్ఛార్జులపైనే భారం
పోస్టుల భర్తీ కాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. సిబ్బంది కొరత కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అనేక కేంద్రాలు ఇన్ఛార్జులపైనే ఆధారపడుతున్నాయి. ఒక కేంద్రంలోని సిబ్బందికి మరో కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందాల్సిన గుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహార పంపిణీ కూడా ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాలు సక్రమంగా నిర్వహించకపోవడం, పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ, వ్యాక్సినేషన్ ట్రాకింగ్ వంటి సేవలపై కూడా ప్రభావం పడుతోంది.
తొలి అక్షరాలకే దూరం
అంగన్వాడీ కేంద్రాలు కేవలం పౌష్టికాహారం అందించే కేంద్రాలే కాకుండా.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యకు తొలి మెట్టుగా నిలుస్తాయి. అయితే సిబ్బంది కొరతతో చిన్నారులకు అందాల్సిన ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహార సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం తక్షణం స్పందించాలి
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నియామకాలపై నెలకొన్న గందరగోళానికి తెరదించి స్పష్టమైన పబ్లిక్ నోటీసుతో నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, మెరిట్ జాబితాల విషయంలో పూర్తి పారదర్శకత పాటించి, ఎంపిక జాబితాలను బహిరంగంగా ప్రదర్శిస్తే ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్థానిక నిరుద్యోగ మహిళలకు న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఖాళీల భర్తీతో అంగన్వాడీ వ్యవస్థకు ఊపిరి పోసి.. చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం, విద్య, ఆరోగ్య సేవలను గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

