Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ జిల్లాలో ఐకేపీ నిధులు గోల్‌మాల్.. అధికారుల తీరుపై ఆగ్రహజ్వాలలు

కలం, నల్లగొండ బ్యూరో: మహిళా సాధికారతకు అండగా ఉండాల్సిన ఐకేపీ నిధులు కాస్తా అధికారుల చేతివాటంతో దారిమళ్లాయి. ఏడాది కాలంగా కార్యాలయాల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆగ్రహించిన మహిళలు ఏకంగా సర్పంచ్‌, అధికారులను గ్రామపంచాయతీ కార్యాలయంలో బంధించారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన గళాన్ని వినిపించారు. నల్లగొండ (Nalgonda) జిల్లా కట్టంగూరు మండలంలో ఐకేపీ నిధుల దుర్వినియోగం ఉద్రిక్తతకు దారితీసింది. సుమారు రూ.40 లక్షల మేర అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మహిళా సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.

ఐకేపీ (IKP) నిధుల దారిమళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలో మహిళా సంఘాలు భారీ ఆందోళనకు దిగాయి. తమకు చెల్లించాల్సిన దాదాపు రూ.40 లక్షల నిధుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్, అధికారులను పంచాయతీ కార్యాలయంలోనే బంధించి తాళం వేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏడాది కాలంగా అందని న్యాయం

మహిళా సంఘాలకు సంబంధించిన శ్రీనిధి, ఐకేపీ నిధులను గతంలో ఉన్న అధ్యక్షురాళ్లు, అధికారులు కలిసి దారిమళ్లించారని (IKP Fund Misuse) గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా కలెక్టర్, పీడీ, ఏపీఎం వంటి ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని మహిళలు మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతాధికారులు వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సర్పంచ్‌ను, అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని సంఘం అధ్యక్షురాలు భీష్మించుకు కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులు, మహిళలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

చివరకు అధికారుల హామీతో..

గ్రామంలోని 28 మహిళా సంఘాలకు సంబంధించిన శ్రీనిధి నిధుల అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఐకేపీ సెంటర్ల ద్వారా జరిగిన వడ్ల కొనుగోలులో జరిగిన రూ. 40 లక్షల ఫ్రాడ్‌పై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో నిధులు కాజేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినదించారు. చివరకు ఏపీఎం రాములు జోక్యం చేసుకుని, ఏప్రిల్ 7న గ్రామంలో పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో బంధించిన వారిని విడిచిపెట్టారు మహిళలు.

Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>