బ‌తికుండ‌గానే పెద్ద క‌ర్మ‌.. కార‌ణ‌మిదే!

క‌లం, వెబ్‌డెస్క్‌: సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత దిన క‌ర్మ‌లు చేస్తారు. కానీ, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలో జోహ్డీ గ్రామానికి చెందిన చౌద‌రి బల్జోర్ సింగ్ బతికుండగానే త‌న‌కు తాను పెద్ద క‌ర్మ‌ నిర్వహించుకున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆదివారం తన సొంతూరులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 900 మంది బంధువుల‌ను పిలిచి భోజ‌నాలు కూడా పెట్టారు. బల్జోర్ సింగ్ అతిథులకు భోజ‌నాలు వ‌డ్డించి వారితో కలిసి భోజనం చేయడం విశేషం.

తన జీవితకాలంలోనే తనకు పరిచయమున్న వారందరినీ ఒకచోట చేర్చి, వారితో కలిసి భోజనం చేయాలన్న కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బల్జోర్ సింగ్ తెలిపారు. జీవితాంతం త‌న వారంద‌రితో మంచి సంబంధాలు కొనసాగించానని, అందరి ఆహ్వానాలపై విందులకు హాజరయ్యానని తెలిపారు. అదే విధంగా తాను కూడా అందరికీ విందు ఇవ్వాలనుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో భారీ ఏర్పాట్లు చేసి పూరీలు, రైతా, రెండు రకాల కూరలు, లడ్డూలతో పాటు పలు వంటకాలను సిద్ధం చేశామ‌న్నారు. ఉదయం పెద్ద క‌ర్మ‌ నిర్వహించి, మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మరో విశేషం కూడా చోటుచేసుకుంది. సాధారణంగా బుల్జోర్ సింగ్ కుటుంబ ఆన‌వాయితీ ప్ర‌కారం కుటుంబ పెద్ద మరణించిన తర్వాత వారసుడికి పగిడీ కట్టి కుటుంబ బాధ్యతలు అప్పగిస్తారు. అయితే బల్జోర్ సింగ్ తాను బ‌తికుండ‌గానే తన పగిడీని మనవడు ముకుల్‌కు స్వయంగా కట్టి కుటుంబ బాధ్యతలను తదుపరి తరానికి అప్పగించారు. కుమార్తె పింకీ, అల్లుడు సుఖ్‌పాల్, ముగ్గురు మనవరాళ్లు, ఒక మనవడితో తన కుటుంబం సమక్షంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అలాగే తాను మ‌ర‌ణించిన త‌ర్వాత ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ కుమార్తెకు భారంగా మారొద్ద‌నే ఉద్దేశంతో ముందుగానే చేసుకున్న‌ట్లు చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>