కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) ముగింపు దశకు చేరుకున్నది. కేంద్రం పెట్టిన డెడ్‌లైన్ మార్చి 31వ తేదీతో ముగుస్తున్నది. ఈ పది రోజుల్లో ఏం జరగనున్నదనేది ఆసక్తిగా మారింది. ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్‌ను మరికొన్ని రోజులు లేదా నెలలు పొడిగిస్తుందా?.. ముగిసినట్లు ప్రకటిస్తుందా?.. అప్పటిలోగా గణపతి సహా మరికొందరు కీలక నేతలను అరెస్టు చేస్తుందా?.. లేక సరెండర్ అయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయా?.. లేక ఎన్‌కౌంటర్‌లు జరుగుతాయా?.. అప్పటివరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ప్రకటిస్తుందా?.. ఇలాంటి సందేహాలు నెలకొన్నాయి. మావోయిస్టు (Maoist Party) పార్టీకి చెందిన కీలక నేతల్లో చాలా మంది లొంగిపోయారు. కొందరు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఇంకొందరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ పది రోజుల్లో జరిగే పరిణామాలే కీలకం.
‘మావోయిస్టు ముక్త్ భారత్’ లక్ష్యంగా… :
మావోయిస్టు పార్టీని అంతమొందిస్తామని, దాని కదలికలను పూర్తిగా నియంత్రిస్తామని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. ‘మావోయిస్ట్ ముక్త్ భారత్’ కోసం ఆపరేషన్ కగార్‌ను 2024 జనవరి నుంచి ప్రారంభించింది. ఏకకాలంలో బహుముఖ వ్యూహంతో మావోయిస్టు పార్టీ యాక్టివిటీస్‌ను కంట్రోల్ చేయడంపై ఫోకస్ పెట్టింది. వివిధ రాష్ట్రాల పోలీసు బలగాలతో కోఆర్డినేషన్ ప్రక్రియను బలోపేతం చేసింది. భారీ సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను అడవుల్లో దింపి కూంబింగ్ ముమ్మరం చేసింది. కేంద్ర హోం శాఖ కేంద్రంగా రోజువారీ ఆపరేషన్‌పై కమాండ్ కంట్రోల్ మెకానిజం ఏర్పడింది. చనిపోవడమో.. లొంగిపొవడమో.. ఇవి మినహా మూడో ప్రత్యామ్నాయం లేదనే మెసేజ్‌ను పంపింది. ఒకవైపు పార్టీలో అంతర్గత సంక్షోభం, మరోవైపు సైద్ధాంతిక పోరాటం, ఇంకోవైపు భద్రతా బలగా ముప్పేట దాడి.. వీటన్నింటి నడుప మావోయిస్టు పార్టీ బలహీనమైంది.
‘డెడ్‌లైన్’ పై కేంద్రం ఇచ్చే క్లారిటీ ఏంటి? :
కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ మార్చి 31న ముగుస్తున్నది. ఆ రోజున లేదా మరుసటి రోజు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనున్నది? మావోయిస్టు పార్టీ ఇక ముగిసిన అధ్యాయం అని ప్రకటించనున్నదా?.. ‘సంపూర్ణం అయింది’ అని స్టేట్‌మెంట్ ఇస్తుందా?.. చిట్టచివరి నాయకుడు లొంగిపోవడమో లేక ఎన్‌కౌంటర్‌లో ఎలిమినేట్ కావడమో జరిగేంత వరకూ కొనసాగుతుందని ప్రకటిస్తుందా?.. లేక మరికొన్ని రోజులు పొడిగిస్తున్నామని చెప్తుందా?.. లేక సరెండర్ కావాల్సిందే అని లాస్ట్ వార్నింగ్ ఇస్తుందా?.. ఒకరిద్దరు లీడర్లు మిగిలినా ఇక ఆ పార్టీతో ఒరిగేదేమీ లేదని అంటుందా?.. ఇలాంటి అనేక రకాల సందేహాలు నెలకొన్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా యాక్షన్ ప్లాన్‌పై ఉత్కంఠ నెలకొన్నది. మావోయిస్టు పార్టీలో ఇంకా ఎంతమంది అజ్ఞాతంలోనే ఉండిపోయారన్న అంశంపైనా స్పష్టత కొరవడింది.
గణపతి ఇష్యూతోనే ‘ఎండ్ కార్డ్’? :
మావోయిస్టు అగ్రనేత గణపతి (Maoist Ganapathi) ఎక్కడున్నారు?.. భారత్‌లోనే ఉన్నారా?.. నేపాల్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో తలదాచుకున్నారా?.. ఆ సమాచారం కేంద్ర ప్రభుత్వానికి అందిందా?.. అక్కడి నుంచి రప్పించడానికి ఆ దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయా?.. లేక ఇప్పటికీ కేంద్ర లేదా తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసుల కంట్రోల్‌లోకి వచ్చారా?.. సరెండర్ ప్రయత్నాలు డెడ్‌లైన్ సమయానికి కొలిక్కి వస్తాయా?.. ఆయన సరెండర్‌తోనే ‘ఆపరేషన్ కగార్’కు (Operation Kagar) ‘ఎండ్ కార్డ్’ పడుతుందా?.. ఆయనతో పాటు ఇంకా అజ్ఞాతంలోనే ఉండిపోయిన పాపారావు, నరహరి, అనల్ దా.. ఇలాంటివారు లొంగిపోతారా?.. వారు ఎప్పటికీ అజ్ఞాతంలోనే ఉండిపోతారా?.. ‘మిస్సింగ్’ జాబితాలో ఉండిపోతారా?.. అజ్ఞాతంగానే పోరాటాన్ని కొనసాగిస్తారా?.. వారి ఆరోగ్యం సహకరిస్తుందా?.. ఇలాంటివాటికి కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తుందన్నది కూడా కీలకం.
Read Also: తెలంగాణకి మోదీ.. గ్రాఫ్ పెరిగేలా పొలిటికల్ స్కెచ్
Follow Us On : WhatsApp

