కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పశు సంవర్ధక శాఖ నిర్ణీత గడువులోగా తమ శాఖ లక్ష్యాలను పూర్తి చేయాలని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పశుసంవర్ధక శాఖ త్రైమాసిక సమీక్షలో పాల్గొన్నారు. మండలాల వారీగా కృత్రిమ గర్భధారణ, టీకాల కార్యక్రమం, డీ-వార్మింగ్, పశువుల కాస్ట్రేషన్, గడ్డి విత్తనాల పంపిణీ తదితర కార్యక్రమాల పురోగతిని పశు వైద్య అధికారులతో సమీక్షించారు.
రైతులకు అందుబాటులో ఉండాలి..
కొన్ని మండలాల్లో పశు వైద్య అధికారులు లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉన్నారని గమనించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా కారణాలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రెండు, మూడు నెలల్లో అన్ని కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. అలాగే పశు వైద్య ఆసుపత్రులు, ఉప కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, గోపాలమిత్రలు, పారా వెటర్నరీ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.
ప్రతి కేంద్రంలో హాజరు నమోదు తప్పనిసరిగా నిర్వహించాలని, అనుమతి లేని డిప్యూటేషన్లకు అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పశువుల వ్యాక్సినేషన్, కృత్రిమ గర్భధారణ, డీ-వార్మింగ్ వంటి సేవలపై రైతులకు విస్తృత ప్రచారం నిర్వహించి, శాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. జిల్లాలో మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 75 శాతం సబ్సిడీతో అందుబాటులో ఉన్న గడ్డి విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇబ్బందులపై ఆరా..
క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను కలెక్టర్ ఖుష్బూ గుప్తా అడిగి తెలుసుకున్నారు. చాలా పశు వైద్య కేంద్రాలలో భవనాలు శిథిలమైపోయాయని, కొన్ని ఉప పశు వైద్యశాలల్లో మందులు భద్రపరిచేందుకు రిఫ్రిజిరేటర్లు లేవన్నారు. అలాగే మహిళా వైద్య అధికారులకు శౌచలాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ రిపేర్లకు సంబంధించి ప్రతిపాదనలు వెంటనే పంపాలన్నారు.
త్వరలోనే రిఫ్రిజిరేటర్లను అందిస్తామన్నారు. అన్ని పశు వైద్య కేంద్రాల్లో మూత్ర శాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా పశు వైద్య శాఖ అధికారికి కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వెటర్నరీ అధికారి డా.శివేంద్రస్వామి, సహాయ సంచాలకులు డా. బాలాజీ, మండల పశువైద్య అధికారులు, గోపాలమిత్రలు, పారా వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.

