కలం, జనగామ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకం పేద, మధ్యతరగతి కుటుంబీకుల జీవితాల్లో పెను మార్పులు తీసుకువస్తోంది. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తుండటంతో లబ్ధి దారులకు ‘జీరో బిల్లు’ వస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న ప్రజలు తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకోవడానికి వంట గ్యాస్ (LPG) వాడకాన్ని తగ్గించి, విద్యుత్ పొయ్యిల (Induction Cooking) వైపు మొగ్గు చూపుతున్నారు.
మార్కెట్‌లో పెరిగిన సందడి..
గడిచిన కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ షాపులు వినియోగదారులతో కిక్కిరిసిపోతున్నాయి. విపరీతమైన గ్యాస్ డిమాండ్ కారణంగా కొన్ని చోట్ల స్టవ్‌ల ధరలు రూ.100 నుండి రూ. 300 వరకు పెరిగాయి. మరోవైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా పలు పాపులర్ మోడల్స్ ‘అవుట్ ఆఫ్ స్టాక్’ అవుతున్నాయి.
గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు ఇండక్షన్ స్టవ్‌లను వాడటం వల్ల రెండు రకాల ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో, విద్యుత్ పొయ్యిని వాడటం వల్ల సిలిండర్ ఎక్కువ రోజులు వస్తోంది. 200 యూనిట్లలోపు వినియోగం ఉంటే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది కాబట్టి, విద్యుత్ వినియోగంపై అదనపు భారం పడటం లేదు.
జనగామ జిల్లాలో 12 మండలాలు కలిపి సుమారుగా 70,000 మందికి పైగా వినియోగదారులు ప్రతి నెలా 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతూ ‘జీరో బిల్లులు’ పొందుతున్నట్లు అంచనా గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల ఎంతో మంది ప్రయోజనం పొందుతున్నారు.
నిపుణుల సూచన:
విద్యుత్ పొయ్యిల (Induction Cooking) ను వాడుతున్నప్పుడు వినియోగదారులు తమ నెలవారీ రీడింగ్‌ను గమనిస్తూ ఉండాలి. వినియోగం 200 యూనిట్లు దాటితే, మొత్తం యూనిట్లకు బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

