కలం, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ (PM Modi) త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంతో సంబంధం లేకుండా నగరంలో బీజేపీ బలం పుంజుకునేలా ప్రధాని మోడీ పెరేడ్ గ్రౌండ్‌లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ రెండవ వారంలో ప్రధాని ప్రోగ్రామ్ ఉండొచ్చని రాష్ట్ర బీజేపీ వర్గాల సమాచారం. తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడ పర్యటించే మోడీ తెలంగాణనూ విజిట్ చేసేలా కేంద్ర నాయకత్వం స్థాయిలో ప్రాథమిక చర్చలు మొదలయ్యాయి. నిర్దిష్టంగా షెడ్యూలు ఖరారు కాకపోయినప్పటికీ వచ్చే నెలలో విజిట్ చేసే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగానే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల భవనాల ప్రారంభోత్సవం, రైల్వేకు సంబంధించిన వివిధ సర్వీసుల లాంఛింగ్ తదితరాలు ఉండనున్నాయి.
నగరంలో బీజేపీ గ్రాఫ్ పెరిగేలా పొలిటికల్ స్కెచ్ :
జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు పూర్తికావడంతో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇంతకాలం జీహెచ్ఎంసీగా ఉనికిలో ఉండగా ఇప్పుడు దాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఒకవైపు నగరపాలక సంస్థల సరిహద్దులు మారకూడదన్న సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆంక్షలు, మరోవైపు హైకోర్టులో మూడు కార్పొరేషన్ల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల నిర్వహణకు లీగల్ చిక్కులు తలెత్తాయి. ఇంతకాలం జీహెచ్ఎంసీలో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ ఈసారి మేయర్ పోస్టును కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నది. కానీ మూడు కార్పొరేషన్లుగా విడిపోయినందున ఆ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనే అంశం తెరపైకి వచ్చింది. నగరంలో పాతబస్తీ మినహా మిగిలినచోట్ల బీజేపీ బలపడడంతో గ్రాఫ్ తగ్గిపోకుండా సంస్థాగతంగా మరింత బలపడేలా ప్లాన్ చేస్తున్నది.
రూరల్, అర్బన్ ఎలక్షన్స్ లో నిరాశ :
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే. ఫలితాలూ ఆ పార్టీ ఆశించిన స్థాయిలో రాలేదు. కరీంనగర్ కార్పొరేషన్‌ను చేజిక్కించుకోగలిగినా నిజామాబాద్‌లో బెడిసికొట్టింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా మున్సిపల్ చైర్‌పర్సన్ పోస్టుల్ని చేజిక్కించుకోలేకపోయింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎక్కువ మంది గెలవలేకపోయారు. దీంతో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయకపోతే కష్టమేననే డైలమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమైంది. దిద్దుబాటు చర్యలను జీహెచ్ఎంసీ నుంచే మొదలుపెట్టాలనుకున్నది. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. మోడీ (PM Modi) ఇమేజ్‌ను వాడుకుని గ్రేటర్ పరిధిలో మేయర్ స్థానాన్ని గెల్చుకోవడంతో పాటు పార్టీ బలపడిందనే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నది. అందుకే పెరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నది.
బీమీ నగర్ ఎయిమ్స్ భవనం ఓపెనింగ్ :
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రధాన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందునే రాష్ట్రానికి ఎయిమ్స్ సాధ్యమైందని ఇప్పటికే కిషన్‌రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారు. దాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తే పార్టీకి రాషట్రవ్యాప్తంగా మైలేజ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. పలు జాతీయ రహదారులకు (హైవే నెం. 65, 161)లను ప్రారంభించే అవకాశమున్నది. ఎంఎంటీఎస్ ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టులో కొత్త మార్గాలు, ఇండోర్-హైదరాబాద్ ఎకనామిక్ కారిడార్ రైల్వే లైన్ పనులను కూడా ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఆఫీసర్లు సైతం ప్రధానితో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Read Also: సిలిండర్లపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం
Follow Us On : WhatsApp

