Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రి కల ఫలించేనా..? కలగా మిగిలేనా..? పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆశలు

కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కి అమాత్య యోగం దక్కుతుందా? లేక అధిష్ఠానం హామీలు బుట్టదాఖలు అవుతాయా? అనేది ఉత్కంఠగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి సాకుతో ఆయన సంధిస్తున్న విమర్శలు.. సొంత గూటికి హెచ్చరికలా? లేక మంత్రి పదవి కోసం వేస్తున్న వ్యూహాలా? అనేది ప్రశ్నార్ఘకంగా మారింది. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ శైలి ఎప్పుడూ సపరేటే. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కేవలం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినవి మాత్రమేనా? లేక దీని వెనుక బలమైన రాజకీయ అసంతృప్తి దాగి ఉందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఊరిస్తున్న అమాత్య యోగం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (Rajagopal Reddy) మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రివర్గంలో ఉండడం.. సామాజిక సమీకరణాలు, ఇతర రాజకీయ కారణాల వల్ల రాజగోపాల్ రెడ్డికి ఇంకా ఆ అవకాశం దక్కలేదు. తన సీనియారిటీకి తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో (Munugode) అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, కేవలం మంత్రుల సెగ్మెంట్లలోనే పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన నేరుగా ప్రభుత్వంపైనే విమర్శలు సంధించారు. ముఖ్యమంత్రి చుట్టూ తిరిగితేనే నిధులు వస్తాయా? అని ఆయన ప్రశ్నించడం గమనార్హం. ఇది కేవలం నిధుల కోసం చేస్తున్న పోరాటం కంటే.. తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి, అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడానికి ఎంచుకున్న మార్గంగా కనిపిస్తోంది.

మళ్లీ విపక్షాల వైపు చూపు?

గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వదిలి బీజేపీలోకి వెళ్లడం.. మళ్లీ వెనక్కి రావడం వంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఆయన గళంలో పదును పెరగడం.. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం వంటివి కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. అధిష్ఠానం తనను నిర్లక్ష్యం చేస్తే.. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనే సంకేతాలను ఆయన ఈ విధంగా పంపిస్తున్నారా? అన్న అనుమానాలు లేకపోలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి కోసం పనిచేసిన కార్యకర్తలు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదనలో ఉన్నారు. నిధుల రాకలో జాప్యం వల్ల క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకోవడం ఆయనకు సవాలుగా మారింది.

దీంతో తన నియోజకవర్గ ప్రజల కోసం తాను ఎవరినైనా ఎదిరిస్తాననే సంకేతాన్ని ఇవ్వడం ద్వారా తన పట్టును నిలబెట్టుకోవాలని రాజగోపాల్​ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్లే ఆయన ముఖ్యమంత్రి, మంత్రులపై విమర్శలు ఎక్కుపెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఒక ఓపెన్ సీక్రెట్‌గా మారింది. అభివృద్ధి నిధుల సాకుతో రాజగోపాల్ రెడ్డి మొదలుపెట్టిన ఈ పోరాటం.. మంత్రి పదవి దక్కించుకునే వరకు కొనసాగుతుందా? ఆయనను బుజ్జగించి మంత్రి పదవి కట్టబెడతారా? లేక అభివృద్ధి నిధుల కేటాయింపుతో సరిపెడతారా? అన్నది వేచి చూడాలి.

Read Also: బెంగుళూరు నుంచి హైద‌రాబాద్‌కు ఊపిరితిత్తులు.. స‌జ్జ‌నార్ అల‌ర్ట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>