కలం, వెబ్ డెస్క్: బీహార్ (Bihar)లోని కిషన్‌గంజ్ (Kishanganj) డీఎస్పీ గౌతమ్ కుమార్ (DSP Gautam Kumar)పై ఆర్థిక నేరాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కళ్లు చెదిరే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ్ కుమార్ తన 32 ఏళ్ల సర్వీసులో ఆదాయానికి మించి దాదాపు రూ.80 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆయనకు విలాసవంతమైన బంగ్లాలు, టీ గార్డెన్లు, ఫ్లాట్లు ఉన్నట్లు సోదాల్లో తేలింది. ఈ దాడుల అనంతరం ప్రభుత్వం ఆయనను విధుల్లో నుంచి తొలగించి, తదుపరి విచారణకు ఆదేశించింది.
ఈ కేసులో ఓ అంశం అధికారులతో పాటు ప్రజలను షాక్‌కు గురి చేస్తోంది. గౌతమ్ కుమార్ వద్ద పని చేసే పారో అనే పని మనిషి లైఫ్ స్టైల్ చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఆమెకు దాదాపు రూ.కోటి విలువైన బంగ్లా ఉంది. అంతే కాకుండా ఆమె రూ.35 లక్షల విలువైన థార్ ఎస్‌యూవీ కారును వాడుతున్నట్లు తేలింది. రోజూ డ్యూటీకి కూడా ఇదే కారులో రావడం విశేషం. గౌతమ్ కుమార్ ఆమెకు ఒక బుల్లెట్ బైక్‌ను బహుమతిగా ఇచ్చారని, ఆమె సోషల్ మీడియాలో కరెన్సీ కట్టలతో రీల్స్ చేసేదని అధికారులు గుర్తించారు. గౌతమ్ కుమార్ గిఫ్ట్ ఇచ్చిన బుల్లెట్ బైక్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ ఆస్తుల వెనుక గౌతమ్ కుమార్ భార్య, స్నేహితురాలి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అధికారుల దాడులపై సమాచారం అందుకున్న పారో సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేసి పరారైంది. ప్రస్తుతం పోలీసులు, అధికారులు పారో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Also: మంత్రి కల ఫలించేనా..? కలగా మిగిలేనా..? పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆశలు
Follow Us On : WhatsApp

