Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రాన్స్‌ఫార్మర్ రాగి కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని ఆర్మూర్ (Armur) డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లలోని  రాగి కాయిల్స్‌ను దొంగతనం చేస్తున్న ముఠాను వేల్పూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు దొంగలతో పాటు దొంగిలించిన రాగి కాయిల్స్‌ను కొనుగోలు చేస్తున్న స్క్రాప్ వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు 74 కిలోల రాగి తీగ, ట్రాలీ ఆటో, రెండు బైక్‌లు, స్కూటీ, ఐదు మొబైల్ ఫోన్‌లు, చోరీలకు ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అరెస్ట్ అయిన వారిలో ఆర్మూర్ పోచమ్మ గల్లీకి చెందిన కర్రే వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజోల్ల ఈశ్వర్, బాజ హరిప్రసాద్, కర్రే విజయ్ కుమార్, మూల దుర్గాప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడ్డారని పోలీసులు తెలిపారు. వినోద్ కుమార్, విజయ్ కుమార్ అన్నదమ్ములు కాగా, వీరు ఆర్మూర్ పరిసర ప్రాంతాలలో పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే సమయంలో గ్రామ శివార్లలోని ట్రాన్స్‌ఫార్మర్‌లను  గుర్తించేవారు.స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబా ఇచ్చిన సలహాతో రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లలోని  రాగి కాయిల్స్‌ను చోరీ చేసి అతనికే విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

ఈ ముఠా వేల్పూరు, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, యెర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధులలో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై మొత్తం 19 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. వేల్పూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4, బాల్కొండలో 5, మెండోరలో 3, భీంగల్‌లో 1, ఆర్మూర్‌లో 5, యెర్గట్ల పోలీస్ స్టేషన్‌లో 1 కేసు ఉన్నట్లు వెల్లడించారు. వేల్పూరు మండలం పడగల్ గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అలాగే చోరీ సొత్తును కొనుగోలు చేసిన అబ్దుల్ వసీం అలియాస్ తిల్లి బాబాను ఆర్మూర్‌లో అరెస్ట్ చేశారు. గతంలోనూ అబ్దుల్ వసీంపై ఆర్మూర్, మెండోర, నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లలో చోరీ సొత్తు కొనుగోలు చేసిన కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>