కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి (Venkata Ramana Reddy) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, జీతభత్యాలు, పీఆర్సీ, రిటైర్మెంట్ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ”అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడా. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం ముందుకుసాగదు. గత ప్రభుత్వం 15కి జీతాలు, రిటైర్డ్ అయిన వాళ్ళకి కొంతైనా బిల్లులు ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలు తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల గురించి ఈ ప్రభుత్వానికి సోయి లేదు. గత ఏడాది మార్చి నుంచి 20,500 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు, బిల్లులు ఇవ్వాల్సి ఉంది. రిటైర్డ్ అయిన వాళ్లకు అలవెన్స్ లేవు, టీఏ, డీఏ, పీఆర్సీ ఊసే లేదు. ఉద్యోగులు సొంతంగా జమ చేసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదు” అని ఆయన అన్నారు.
”రాష్ట్ర ఖజానాలో తప్పకుండా ఇవ్వాల్సిన బిల్లులు ఉంటాయి. ఉద్యోగులకు ఇచ్చిన తర్వాతే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఖర్చు చేయాలి. 750పైగా ఉద్యోగులు వారి పెండింగ్ బిల్లుల కోసం కోర్టుకు వెళ్లారు. అయినా ఇప్పటికీ ఇవ్వలేదు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 18 నెలలుగా మెయింటెనెన్స్ బిల్లులు (Bills) లేవు. అధికారులు సొంతంగా ఖర్చు చేస్తున్నారు. ఉద్యోగులు చనిపోతే అంత్యక్రియలకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. ఉద్యోగులకు హెల్త్ కార్డ్, ఆరోగ్య భద్రతను కూడా ఇవ్వనని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారంటే పోలీసులు కారణం. కేసీఆర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకనే రిటైర్మెంట్ వయస్సు పెంచారు. ఇప్పటికీ సుమారు 14 వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఉన్నాయి” అని కాటిపల్లి అన్నారు.
”ఆర్థిక శాఖ మంత్రి నెలకు 700 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులు విడుదల చేస్తామని వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదు. తమ రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం షుగర్, బీపీలతో నిన్న రిటైర్డ్ ఉద్యోగులు రోడ్డు ఎక్కారు. మార్చి 1న ఉద్యోగస్తులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే మార్చి 2 నుంచి నేను నిరాహార దీక్షలో కూర్చుంటాను. ఉద్యోగస్తుల పెండింగ్ బిల్లు చెల్లించే వరకు నేను శాసనసభకి రాను. ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసే పరిస్థితి వస్తే పాలనా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది” అని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు.

Read Also: కల్వకుంట్ల టు దేవనపల్లి పేరు, రూటు మార్చిన కవిత
Follow Us On: Pinterest


