హైదరాబాద్(Hyderabad) మీర్‌పేట్ పరిలోని జిల్లలగూడ ప్రగతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. సంధ్య అనే మహిళ తన భర్త విజయ్ కుమార్‌ను అతికిరాతకంగా హతమార్చింది. అనంతరం అతని హత్యను ప్రమాదంగా చూపే ప్రయత్నం చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంగానే సంధ్య తన భర్తను హతమార్చిందని పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ కుమార్, సంధ్య తమ ముగ్గురు పిల్లలతో కలిసి ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయ్ కుమార్ ఆటో నడుపుతుండేవాడు. సంధ్య.. పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. కొంతకాలంగా సంధ్య తన సహోద్యోగితో వివాహేతర సంబంధంలో ఉంది. ఈ విషయంలో సంధ్య, విజయ్‌కు నిత్యం గొడవలు అవుతూ ఉండేవి. ఈ క్రమంలోనే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తన భార్య సహోద్యోగిని విజయ్ బెదిరించాడు. దాంతో అతనిని అడ్డు తొలగించుకోవాలని సంధ్య నిశ్చయించుకుంది.
Hyderabad | ఈ క్రమంలోనే నిద్రపోతున్న సమయంలో విజయ్ కుమార్ మెడకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చింది. ఆ తర్వాత కూడా అనుమానంగా ఉండటంతో విజయ్ తలపై కర్రతో గట్టిగా కొట్టింది సంధ్య. అనంతరం విజయ్ మృతదేహాన్ని బాత్రూమ్‌లో పడేసి.. జారిపడి మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. విజయ్ కుటుంబ సభ్యులకు అదే చెప్పింది. కానీ, అంత్యక్రియలకు సిద్ధం చేసే సమయంలో ఇంట్లో రక్తం అంటుకుని ఉన్న తాడును చూడటంతో విజయ్ తల్లికి అనుమానం కలిగింది. దాంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్ కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం పంచనామా నివేదిక ఆధారంగా విచారణ చేయగా తానే హతమార్చినట్లు సంధ్య అంగీకరించింది.

