Mobile Popup Ad
Mobile Popup Ad

కిడ్నీలో రాళ్లు కరిగిన తర్వాత మళ్లీ ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే!

కలం, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆధునిక జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ‘కిడ్నీలో రాళ్లు’ (Kidney Stones) ఒకటి. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య, నేడు వయసుతో నిమిత్తం లేకుండా యువతలోనూ, మధ్యవయస్కులలోనూ విపరీతంగా పెరుగుతోంది. అయితే కిడ్నీలో రాళ్లు ఒకసారి కరిగిన తర్వాత కూడా మళ్లీ వస్తాయని మీకు తెలుసా? అవును సరైన జీవన శైలి, ఆహార నియమాలను పాటించకపోతే రాళ్లు మళ్లీ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మనం తాగే నీటి పరిమాణం, ఆహారపు అలవాట్లు, శరీర బరువు, జీవనశైలి వంటి అంశాలే కిడ్నీలో రాళ్లు మళ్లీ మళ్లీ ఏర్పడటానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి, మళ్లీ రాకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో నిపుణులు సూచించారు.

కిడ్నీలో రాళ్లు మళ్లీ ఎందుకు ఏర్పడతాయి?

కిడ్నీలో రాళ్లు మళ్లీ ఏర్పడటానికి పలు రకాల కారణాలు ఉంటాయి.

  • ఖనిజాలు పేరుకుపోవడం
    మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఎక్కువైనప్పుడు, అవి స్పటికాలుగా మారి రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
  • నీరు తక్కువగా తాగడం
    శరీరానికి సరిపడా నీరు అందకపోవడం, ఆహారంలో ఉప్పు (సోడియం) ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఖనిజాలు పేరుకుపోయి, రాళ్లు మళ్లీ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.

అందుకే రాళ్లు కరిగిపోయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆహార నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన మార్పులు

1. రోజువారీ నీటి వినియోగాన్ని పెంచడం

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో అత్యంత కీలకమైంది ఎక్కువ నీరు తాగడం. ఇది మూత్రంలో ఖనిజాల సాంద్రతను తగ్గించి, అవి రాళ్లుగా మారకుండా చూస్తుంది. అందుకే రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల ద్రవాలను తీసుకోవాలట. మంచి నీరు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగడం కూడా చాలా మంచిదని సూచిస్తున్నారు.

2. ఉప్పు (సోడియం) వినియోగాన్ని తగ్గించడం

ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటే, అది మూత్రంలో కాల్షియం పరిమాణాన్ని పెంచుతుంది. ఇది రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. రోజువారీ ఉప్పు వినియోగం 2300 mg కంటే తక్కువగా ఉండాలని సూచిస్తున్నారు.

3. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను నియంత్రించడం

మూత్రంలోని కాల్షియం, ఆక్సలేట్‌తో కలిసినప్పుడు ‘కాల్షియం ఆక్సలేట్’ రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్‌లో ఇవే అత్యంత సాధారణ రకం. అధిక ఆక్సలేట్ ఉండే పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్లు, నట్స్ (జీడిపప్పు, బాదం వంటివి), చిలగడదుంప (Sweet potato) వంటి ఆహారాలు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఈ ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ పరిమిత పరిమాణంలో (అతిగా కాకుండా) తీసుకోవడం మంచిదట.

4. జంతు సంబంధిత ప్రోటీన్లను తగ్గించడం

మాంసాహారం (Animal Protein) ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయట. రాళ్లను నిరోధించే ‘సిట్రేట్’ స్థాయిలు తగ్గుతాయట. అందుకే వీటి వినియోగం తగ్గించాలని సూచిస్తున్నారు. వీటికి బదులుగా పప్పుధాన్యాలు, బీన్స్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఆహారంలో చేర్చుకోవాలట.

5. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం

​అధిక బరువు (Obesity) వల్ల శరీరంలో జీవక్రియల (Metabolism) మార్పులు జరిగి, మూత్రంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుందట. అందుకే బరువు తగ్గేందుకు రోజువారీ వ్యాయామం తప్పనిసరిగా చేయాలని, అలాగే అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్స్‌ను తగ్గించాలని సూచిస్తున్నారు.

6. సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం

సిట్రస్ పండ్లలో ఉండే ‘సిట్రిక్ యాసిడ్’ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో అద్భుతంగా సాయపడుతుంది. అందుకే ​నిమ్మకాయ, నారింజ (Orange), బత్తాయి (Sweet lime) పండ్లను తినాలని సూచిస్తున్నారు.

7. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ స్థాయిలు పెరుగుతాయట. అందుకే చక్కెర శాతం ఉండే కేకులు, బేకరీ ఐటమ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఆర్టిఫిషియల్ స్వీట్ డ్రింక్స్ వంటివి తినకూడదట. వాటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా నిలువ చేసిన ఆహారాలైన ఊరగాయలు, బంగాళదుంప చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

గతంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు, కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలట.

1. ​విపరీతమైన కడుపు నొప్పి లేదా నడుము నొప్పి.
2. మూత్రంలో రక్తం పడటం (Hematuria).
3. తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI – మూత్రనాళ ఇన్ఫెక్షన్) రావడం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>