కలం, వెబ్‌డెస్క్: కుమార్తె పెళ్లి వేళ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)కు బిగ్ షాక్ తగిలింది. కొద్ది రోజులుగా వైఎస్ ఫ్యామిలీలో యలహంక ప్యాలెస్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్యాలెస్ వివాదం నేడు బెంగళూరు కోర్టుకు చేరింది. ఆస్తిపై తనకే హక్కులున్నాయన్న షర్మిల వాదనపై సిలికాన్ బిల్డర్స్ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. షర్మిల ఆస్తి తనదేనంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను విచారణ చేపట్టిన కోర్టు షర్మిలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. షర్మిల యలహంక ఆస్తిలోకి ప్రవేశించవద్దని తీర్పు వెలువరించింది. ఆమెతో పాటు కుటుంబసభ్యులు, అనుచరులపైనా నిషేధం విధించింది.
2027 ఫిబ్రవరి వరకు ఆస్తి తమ స్వాధీనంలో ఉంటుందని సిలికాన్ బిల్డర్స్ కోర్టుకు స్పష్టం చేసింది. ఈమేరకు లీజ్ ఒప్పందం, అద్దె చెల్లింపులతో పాటు విద్యుత్ బిల్లులను కోర్టుకు సమర్పించింది. కోర్టు ఈ వివరాలను పరిశీలించి తాజా తీర్పును వెలువరించింది. డిసెంబర్ 19 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

