అమృత్ పథకం పనులను వేగవంతం చేయాలి: పి. సుదర్శన్ రెడ్డి

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నిరంతర తాగునీటి సరఫరా కల్పించేందుకు అమృత్ పథకం (Adilabad AMRUT Scheme ) కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి పలువురు చైర్మన్లు, కౌన్సిలర్లు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలు, అమృత్ పథకం పనుల పురోగతిపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, సంబంధిత అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి సరఫరా పనుల వివరాలను సలహాదారుకు వివరించారు. ఇందులో భాగంగా పట్టణంలో సుమారు 80 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు పూర్తికావస్తున్నాయని, 9 వేల గృహాలకు సర్వీస్ కనెక్షన్లు కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అలాగే పట్టణంలో మొత్తం 9 ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, ఇటీవల నాలుగు రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. మిగిలిన ఐదు రిజర్వాయర్ల పనులను కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పనుల పురోగతిపై సమీక్షించిన ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, కాంట్రాక్టర్లకు నిధుల కొరత లేకుండా బిల్లులు చెల్లిస్తున్నప్పటికీ రిజర్వాయర్ల నిర్మాణ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను నామమాత్రంగా కొనసాగించడం కాకుండా, అవసరమైన మేరకు అదనపు కార్మికులను నియమించి నిర్మాణ వేగాన్ని పెంచాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>