కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజల జీవన పరిస్థితులు, స్థానిక సమస్యలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Adilabad Collector) శిక్షణ సివిల్ సర్వీస్ అధికారులకు సూచించారు. 2026 ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఈ నెల 22 నుంచి 25 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, 26 నుంచి 28 వరకు ఆదిలాబాద్ పట్టణంలో పర్యటనలు నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పథకాల అమలు, వారి సమస్యలు, అవసరాలను తెలుసుకోవాలన్నారు. జిల్లాలో విస్తారంగా ఉన్న అటవీ ప్రాంతాల నేపథ్యంలో అటవీ హక్కుల చట్టం అమలు, గిరిజనులకు మంజూరైన పట్టాలు, పీవీటీజీ, కోలాం, తోటి కుటుంబాల గృహ నిర్మాణాల పురోగతిని పరిశీలించాలని సూచించారు. అలాగే చెరువులు, సాగునీటి వనరులు, రైతులు సాగు చేస్తున్న పంటలు, వారి ఆదాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వైద్య కేంద్రాలు, అంగన్‌వాడీలను సందర్శించి విద్య, వైద్య, పోషకాహార సేవల పనితీరును పరిశీలించాలని తెలిపారు.
పట్టణ పర్యటనల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. పర్యటనల అనంతరం సమీక్ష నిర్వహించి అధికారుల అనుభవాలు, పరిశీలనలను తెలుసుకుంటామని తెలిపారు. శిక్షణ అధికారులకు జిల్లా యంత్రాంగం అన్ని విధాల సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ రవీందర్, డీపీఓ రమేష్, డీఈఓ మడావి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాజలింగు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

