కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ (Telangana BJP)ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అగ్రనేతలు వరుసగా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 23న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్లో నిర్వహించనున్న మహా పాదయాత్రలో పాల్గొననుండగా, 24న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు.
ఇక 25న సిద్దిపేటలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొననున్నారు. జాతీయ నేతల పర్యటనలను పార్టీ విస్తరణకు, కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది. వరుస పర్యటనల నేపథ్యంలో బీజేపీ ప్రకటించబోయే తదుపరి కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
నితిన్ నబీన్ షెడ్యూల్‌పై ఉత్కంఠ
ఈ నెల 23న కరీంనగర్లో ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకత్వాన్ని పాతరేద్దాం’ అనే నినాదంతో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. మధ్యాహ్నం జరిగే ఈ కార్యక్రమంలో నితిన్ నబీన్ పాల్గొననుండటంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం, స్థానిక నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
నితిన్ నబీన్ కరీంనగర్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్‌లోనూ అదే రోజు పాదయాత్ర నిర్వహించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ విషయంలో పట్టుదలతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. జాతీయ అధ్యక్షుడి పర్యటనలో నిజామాబాద్‌కు కూడా సమయం కేటాయించాలని అరవింద్ కోరుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో నితిన్ నబీన్ షెడ్యూల్లో నిజామాబాద్‌కు చోటు దక్కుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.

