కలం, నిర్మల్ : రెవెన్యూ సంబంధిత దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ( Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మండల స్థాయిలో వచ్చే అర్జీలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన దరఖాస్తులను ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని, పరిష్కార వివరాలను క్లుప్తంగా పొందుపరచాలని ఆదేశించారు.
మండలాల వారీగా కొనసాగుతున్న భూముల రీ సర్వే పురోగతిని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యం, పూర్తయిన సర్వే, మిగిలిన భూముల వివరాలను తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, సర్వేకు ముందే సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. హద్దులను పక్కాగా గుర్తించి, సర్వే పూర్తయిన వెంటనే వివరాలను రైతులకు తెలియజేయాలని, ఎక్కడా పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవరావు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏడి ల్యాండ్ సర్వే రికార్డ్ విఠల్, పౌరసరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

