epaper
Tuesday, November 18, 2025
epaper

బీజేపీ డిపాజిట్ గల్లంతు.. ఈ పతనానికి కారణం ఏంటి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ(BJP) పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. ఆ పార్టీ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేవలం 17 వేలపైచిలుకు ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు, బలమైన నేతలు ఉన్నా బీజేపీకి ఉపయోగం లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. కానీ ఈ ఫలితం చూశాక బీజేపీ క్యాడర్‌కు కూడా నమ్మకం పోయి ఉంటుంది. అసలు ఈ పతనానికి కారణం ఏమిటి? ఎందుకు బీజేపీ ఇంత దయనీయస్థితికి చేరుకున్నది అన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.

అధ్యక్షుడి పరిస్థితి ఏమిటి?

బీజేపీ(BJP)కి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు(Ramachander Rao) ఉన్నారు. కానీ ఆయన ఈ ఎన్నికను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో తెలియదు. ఎన్నికల ప్రచారంలో కూడా పెద్దగా హడావుడి చేయలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ ఆలస్యంగానే ఉంది. అసలు బీజేపీ పోటీలో ఉందా? లేదా? అన్న విషయం కూడా ఓటర్లకు తెలియని పరిస్థితి. కొన్ని బస్తీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హడావుడి చేశారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలుకు చేరువ కావడంలో బీజేపీ ఫెయిల్ అయ్యిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడం.. కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మొదటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే పోటీ మారిపోయింది. దీంతో బీజేపీ లైమ్ లైట్ లో లేకుండా పోయింది. అభ్యర్థి కూడా పెద్దగా పరిచయం లేని వ్యక్తి కావడం గమనార్హం.

బండి ప్రభావం ఏమైంది?

కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కి రాష్ట్రంలో కొంత మాస్ ఇమేజ్ ఉంది. కానీ బండిని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో బీజేపీ సక్సెస్ కాలేకపోయింది. చివర్లో కొన్ని సమావేశాల్లో బండి దూకుడుగా మాట్లాడినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టుంది. వెరసి బీజేపీ ఈ ఎన్నికలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎనిమిది మంది ఎంపీలు, రాష్ట్రస్థాయి నేతలు కనీసం సమన్వయం చేసుకోలేకపోయినట్టు కనిపించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధిష్టానాలు రాష్ట్రస్థాయి నేతలను అందరినీ రంగంలోకి దించాయి. డివిజన్ల వారీగా ఇన్ చార్జ్ లను నియమించి వారికి బాధ్యతలు అప్పగించాయి. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి ఓటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఆఖరికి సీఎం సైతం ప్రచారంలో పాల్గొన్నారు.

కానీ బీజేపీలో ఆ స్థాయిలో బాధ్యతల అప్పగింత, సమన్వయం లోపించినట్టు కనిపించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) మొక్కుబడిగా బస్తీలు తిరిగినట్టు కనిపించింది. ఇక పోల్ మేనేజ్ మెంట్ కూడా ఆ పార్టీ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. పోలింగ్ నాడు కాంగ్రెస్, బీఆర్ఎస్ హడావుడి మాత్రమే కనిపించింది. దీంతో బీజేపీ చతికిలపడిపోయినట్టు కనిపించింది. ఈ ఎన్నికలో నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో ఘన విజయం సాధించగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 74,259 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కేవలం 17 వేల పైచిలుకు ఓట్లు మాత్రమే సాధించారు.

సంస్థాగత బలం లేకపోవడమూ ఓ కారణమా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా సంస్థాగత బలం లేనట్టు కనిపిస్తోంది. ఆ పార్టీని అభిమానించే ఓటర్లు ఉన్నప్పటికీ కార్యకర్తల బలం తక్కువగా ఉంది. నియోజకవర్గంలో బూత్ కమిటీలు వేయడం.. క్యాడర్ ను బలోపేతం చేసుకోవడంలో కాషాయపార్టీ ఫెయిల్ అయినట్టు సమాచారం. అందుకే అత్యంత బలహీనంగా మారిపోయింది. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ ఇంత బలహీనంగా ఉంటే ఎలా అనే ప్రశ్న వస్తోంది. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేస్తే పార్టీకి భవిష్యత్ ఉండే అవకాశం ఉంటుంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఇతర నియోజకవర్గాల్లోనైనా పార్టీ బలోపేతం అవుతుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: ‘కర్మ హిట్స్ బ్యాక్’.. జూబ్లీ పోల్‌పై కవిత

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>