కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ (White House) సమీపంలో జరిగిన కాల్పుల కలకలం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో మరణించిన నిందితుడిని నసీర్ బెస్ట్‌గా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అతను గత కొన్నేళ్లుగా వైట్ హౌస్ పరిసరాల్లోని సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. నిజానికి ఏడాది క్రితమే నసీర్ బెస్ట్ వైట్ హౌస్ నిషేధిత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ సమయంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వైట్ హౌస్ ప్రాంగణానికి ఎట్టిపరిస్థితుల్లోనూ దరిదాపుల్లోకి రావద్దంటూ అప్పట్లోనే న్యాయస్థానం అతనికి కఠిన ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అతను మళ్లీ వైట్ హౌస్ (White House) భద్రతా చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న రక్షణ బలగాలపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నసీర్ బెస్ట్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ దాడి వెనుక గల అసలు కారణాలు, అతడికి ఎవరి తోడ్పాటు అయినా ఉందా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. నసీర్ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన వాషింగ్టన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

