Mobile Popup Ad
Mobile Popup Ad

ఆకట్టుకున్న అర్జున్ టెండూల్కర్.. సచిన్ ఎమోషనల్ పోస్ట్

కలం, వెబ్‌డెస్క్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొడుకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఐపీఎల్ (IPL) 2026 లో సరికొత్త జెర్సీతో మైదానంలోకి అడుగుపెట్టారు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) తరఫున అర్జున్ అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఓడిపోయినప్పటికీ, అర్జున్ తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. కొడుకు అరంగేట్రంపై సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు, అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అర్జున్ టెండూల్కర్‌కు ఈ ఐపీఎల్ సీజన్ చాలా కీలకం. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వేలానికి ముందే లక్నో సూపర్ జాయింట్స్ జట్టులోకి మారిన తర్వాత ఆయన ఆడిన మొదటి సీజన్ ఇది. అయితే లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో, లీగ్ స్టేజ్‌లో తమ చివరి మ్యాచ్‌లో అర్జున్‌కు ఆడే అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అర్జున్ ఐదు బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేశారు.

ఆ తర్వాత బౌలింగ్‌లో అర్జున్ తన మార్క్ చూపించారు. నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టారు. నిజానికి తన మొదటి ఓవర్ లోనే పంజాబ్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను అవుట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ, రిషబ్ పంత్ ఈజీ క్యాచ్ వదిలేశారు. అయినా పట్టుదలతో బౌలింగ్ చేసిన అర్జున్, తన మూడో ఓవర్ లో ఒక అద్భుతమైన యార్కర్‌తో అదే ప్రభ్‌సిమ్రన్‌ను ఎల్‌బిడబ్ల్యూ (LBW) రూపంలో అవుట్ చేశారు. ఆ మ్యాచ్‌లో లక్నో బౌలర్లందరి కంటే అర్జున్ ఎకానమీ రేట్ తక్కువగా ఉండడం విశేషం.

కొడుకు ప్రదర్శన పట్ల సచిన్ టెండూల్కర్ ఎంతో గర్వపడ్డారు. ఈ సీజన్ అంతా అర్జున్ ఎంతో ఓపికగా, సానుకూలంగా ఉన్నాడని సచిన్ కొనియాడారు. చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం ఎదురుచూస్తూ, తనపై నమ్మకంతో నిశ్శబ్దంగా కష్టపడిన విధానం చూసి గర్వంగా ఉందన్నారు. క్రికెట్ ఆట నైపుణ్యాన్ని మాత్రమే కాదు, ఓపికను కూడా పరీక్షిస్తుందని, అర్జున్ ఆ రెండింటినీ చక్కగా హ్యాండిల్ చేశాడని చెప్పారు. ఎప్పుడూ ఒదిగి ఉండాలని, ఆటను ఎప్పటిలాగే ప్రేమిస్తూ ముందడుగు వేయాలని సచిన్ తన కొడుకుకు అభినందనలు తెలుపుతూ పోస్ట్ ముగించారు.

అవకాశాల కోసం ఎదురుచూసి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అర్జున్ టెండూల్కర్ ప్రదర్శనపై క్రీడా వర్గాల్లో మంచి చర్చ నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ యువ ఆల్‌రౌండర్ తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>