కలం, వెబ్ డెస్క్ : ఎండలు ముండిపోతున్న వేసవి కాలంలో ముఖంపై చల్లటి గాలి వీచినా, గొంతులోకి నాలుగు చల్లని చుక్కలు పడినా ప్రాణం లేచి వస్తుంది. ఈ వేడి నుంచి ఉపశమనం పొందడానికి సెలబ్రిటీ చెఫ్ రణ్‌వీర్ బ్రార్ ఒక చక్కని మార్గం చూపించారు. కేవలం 20 నిమిషాల్లోనే ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే మూడు రకాల చల్లని పానీయాల (Summer Drinks) రెసిపీలను ఆయన పంచుకున్నారు.
ఈ పానీయాలను తయారు చేయడానికి ముందుగా కొన్ని బేసిక్ పదార్థాలను సిద్ధం చేసుకోవాలి.
1. షుగర్ సిరప్:
ఒక గిన్నెలో ఒక కప్పు చక్కెర, ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి చక్కెర కరిగే వరకు వేడి చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి.
2. జీలకర్ర పొడి:
పాన్‌లో రెండు పెద్ద చెంచాల జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. దాన్ని రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన ఉంచుకోవాలి.
3. అల్లం పుదీనా పేస్ట్:
అర అంగుళం అల్లం ముక్క, పావు కప్పు తాజా పుదీనా ఆకులను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
ఈ పదార్థాలు సిద్ధమయ్యాక, మూడు రకాల స్పెషల్ డ్రింక్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
లస్సీ తయారీ విధానం:
ఒక గిన్నెలో ఐదారు ఐస్ ముక్కలు, రెండు కప్పుల చిలికిన పెరుగు, రెండు నుంచి మూడు చెంచాల షుగర్ సిరప్ వేయాలి. అందులోనే పావు చెంచా యాలకుల పొడి, పావు చెంచా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరచాలి. ఆ తర్వాత గ్లాసులోకి తీసుకుని తాజా మలై, కుంకుమపువ్వు రెబ్బలు, గులాబీ రేకులతో గార్నిష్ చేసి చల్లచల్లగా అందించాలి.
మసాలా ఛాస్ తయారీ విధానం:
ఒక గిన్నెలో 10 నుంచి 12 ఐస్ ముక్కలు, రెండు కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, రెండు కప్పుల చిలికిన పెరుగుతో పాటు ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పుదీనా పేస్ట్ వేసి బాగా కలపాలి. దీన్ని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. సర్వింగ్ గ్లాసులో పోసి పైన వేయించిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుంటే చల్లని మసాలా ఛాస్ రెడీ అవుతుంది.
మొహబ్బత్ కా శర్బత్ తయారీ విధానం:
ఒక పెద్ద గిన్నెలో సగం పుచ్చకాయ ముక్కలు, ఒక కప్పు షుగర్ సిరప్, నాలుగు స్కూప్‌ల వెనీలా ఐస్‌క్రీమ్ వేయాలి. అందులోనే పావు కప్పు రోజ్ సిరప్, ఒక లీటరు పాలు, 10 నుంచి 12 ఐస్ ముక్కలు, ఒకటిన్నర చెంచాల నానబెట్టిన సబ్జా గింజలు, ఒక కప్పు పుచ్చకాయ రసం, రెండు నుంచి మూడు చెంచాల రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరిచిన తర్వాత గ్లాసులోకి తీసుకుని పుచ్చకాయ ముక్కలు, రోజ్ సిరప్, నానబెట్టిన సబ్జా గింజలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి

