కలం, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల్లో ఓటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. బుధవారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 91.66 శాతం ఓటింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం. మొదటి దశ పోలింగ్ 93.19 శాతంతో కలిపి ఇప్పటి వరకు రెండు దశల్లో పోలింగ్ 92.47 శాతానికి చేరుకుంది. గతంలో 2011 ఎన్నికల్లో నమోదైన 84.72 శాతమే ఇప్పటి వరకు బెంగాల్‌లో అత్యధిక పోలింగ్‌గా ఉంది. ఇక తాజా ఎన్నికలు ఆ రికార్డును తిరగరాశాయి. ఎన్నికల్లో పురుషులు 91.07 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా మహిళలు 92.26 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించింది. ఓటర్ల సౌకర్యార్థం ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల రంగుల ఫోటోలు, కొత్తగా రూపొందించిన ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక రవాణా, వీల్ చైర్ వసతులను కల్పించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1200లకు పరిమితం చేశారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ వేగంగా జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

