కలం, వెబ్ డెస్క్: తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ నరేందర్ రెడ్డితో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
బ్యారేజీ ఎత్తుపై చర్చ
తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఎంత ఎత్తులో నిర్మించాలన్న అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ ఎత్తుల్లో నిర్మిస్తే ఎంత మేరకు నీటిని వినియోగించుకోవచ్చన్న దానిపై అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఇదే తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని సూచించారు.
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు పునాది
ప్రాణహిత- చేవెళ్ల కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం కూడా పూర్తయిందని, మొత్తం 71.5 కిలోమీటర్ల మేర పనులు జరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తయిన పనులను సద్వినియోగం చేసుకునేలా బ్యారేజీ నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు. గత చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అయితే 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్ర ప్రాంతాల్లో ముంపు సమస్యలు తలెత్తే అవకాశముందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో 150 మీటర్ల ఎత్తు మధ్యేమార్గంగా ఉండి, తక్కువ ఖర్చుతో నీటి వినియోగం సాధ్యమవుతుందని నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రభావం ఎక్కడైనా ఉంటే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేశారు.
కేంద్రంతో సమన్వయం
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఆ రాష్ట్రాన్ని ఒప్పించే దిశగా కేంద్ర స్థాయిలో కూడా చర్చలు జరపాలని సీఎం సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆదేశించారు. అలాగే కేంద్ర మంత్రిని నేరుగా కలిసి తెలంగాణ ప్రయోజనాలను వివరించాలని నిర్ణయించారు. ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్‌తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంతాల రైతులకు సాగు, తాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయని సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా, తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.
మేడిగడ్డ పనులపై దృష్టి
ఇదే సమావేశంలో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనుల పురోగతిని కూడా సీఎం సమీక్షించారు. జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండగా, మహారాష్ట్రతో చర్చలు, కేంద్ర సహకారం కీలకంగా మారాయి. 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపడితే తెలంగాణకు గణనీయమైన నీటి లాభాలు కలుగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.

