కేరళ(Kerala) రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో తమ్మనం(Thammanam) ప్రాంతంలో ఓ వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపైకి రావడంతో ఆ ప్రాంతం మొత్తం వరదను తలపిస్తోంది. కేరళ వాటర్ అథారిటీ (కేడబ్ల్యూఏ) ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో దీంతో అనేక ఇళ్లు నీట మునిగాయి, పలు ఇళ్ల పైభాగాలు కూలిపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి.
తెల్లవారుజామున 2 గంటల సమయంలో కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్ హౌస్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొంత భాగం కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నీరు ఉద్ధృతంగా రావడంతో స్థానిక ఇళ్లల్లోకి చేరి ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో పెద్ద మొత్తంలో మందులు, వైద్య పరికరాలు పాడైపోయాయి.
Kerala | 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ట్యాంక్ ద్వారా కొచ్చి, త్రిపునితుర ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోందని ఎర్నాకుళం ఎమ్మెల్యే టీజే వినోద్ వెల్లడించారు. హఠాత్ వరదతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రభావితులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కేడబ్ల్యూఏను కోరారు. కొచ్చి సహా ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కేడబ్ల్యూఏ అధికారులు ప్రకటించారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Read Also: మాయమైపోయిన మనసున్న కవి.. అందెశ్రీ ఇక లేరు
Follow Us on: Youtube

