epaper
Tuesday, November 18, 2025
epaper

మాయమైపోయిన మనసున్న కవి.. అందెశ్రీ ఇక లేరు

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ(Ande Sri) కన్నుమూశారు. సోమవారం ఆయన అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడు’ అన్నపాట ఆయన కలం నుంచి జాలువారిందే. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అందెశ్రీ కీలకపాత్ర ఈ ఉద్యమంలో ఆయన పాటలేని పోరాటమే లేదంటే అతీశయోక్తి కాదు. ప్రాథమిక విద్యకూడా అభ్యసించని అందెశ్రీ పల్లెపదాలు, జానపదాలతో పాటలు కట్టేవాడు. “తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది” అంటూ ఆయన మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.

గొర్రెల కాపరి నుంచి సాహితీ శిఖరం వరకు

అందెశ్రీ(Ande Sri) అసలు పేరు అందె ఎల్లయ్య. 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించారు. బాల్యంలో గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే స్వయంకృషితో కవిగా రాణించారు. ఆశు కవిత్వం చెప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో విశేష ఖ్యాతి సంపాదించారు. ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్రగీతమైంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రూ. కోటి పురస్కారం అందించింది.

సాహిత్య సేవకు గుర్తింపు

అందెశ్రీ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో ‘గంగ’ సినిమాకు నంది రస్కారం పొందారు. 2014 అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ నుంచి డాక్టరేట్ పొందారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా స్వీకరించారు. 2022 జానకమ్మ జాతీయ పురస్కారం అందుకున్నారు 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం కూడా పొందారు.

ముఖ్యమంత్రికి వ్యక్తిగత అనుబంధం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందెశ్రీతో వ్యక్తిగత అనుబంధం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందెశ్రీని ఆదరించలేదు. ఆయనను పాటను తెలంగాణ రాష్ట్రగీతంగా కూడా చేయలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఈ నిర్ణయం జరిగింది. ఉద్యమంలో ‘జయ జయహే తెలంగాణ’ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతాన్ని కొత్త స్వరాలతో రూపొందించడంలో అందెశ్రీతో పంచుకున్న ఆలోచనలు, వ్యక్తిగత అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, డి. శ్రీధర్ బాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

పోలీసు లాంఛనాలతో గౌరవం

అందెశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందెశ్రీ మరణంతో తెలంగాణ సాహిత్యం, సాంస్కృతిక రంగాలు ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయాయి. ఆయన రచనలు, ఉద్యమ కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఎందరో తెలంగాణ ఉద్యమకారులు అందెశ్రీతో తమకు ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు.

Read Also: రేవంత్‌కు సినిమావాళ్లపై ప్రేమ ఎన్నికల వరకే..

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>