కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలోని టేకులపల్లి వద్ద ఉన్న కేసీఆర్ టవర్స్‌లో నీరు రాకపోవడంతో నివాసితులు అల్లాడిపోతున్నారు. నాలుగు రోజులుగా చుక్క నీరు రాకపోవడంతో నిత్యకృత్యాలకు, తాగేందుకు లేక అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మొత్తం 52 బ్లాకులు ఉండగా, 1,240 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఉన్నా, నాలుగు రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా అధికారులు పంపుతున్న ఒకటి రెండు నీటి ట్యాంకర్లు సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కొద్దిపాటి నీటిని ఏ బ్లాక్ వారు పట్టుకోవాలో తెలియక, ప్రజల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి.పైప్‌లైన్లు పగిలినప్పుడో లేదా మరమ్మతుల వలన నీటి సరఫరా ఆగినప్పుడు ప్రత్యామ్నాయంగా కనీసం చేతిపంపులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నాలుగు చేతిపంపులైనా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వస్తే కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతున్నారు. నీటి కరవు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో టేకులపల్లి బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో, ధర్నా చేపడుతామని హెచ్చరిస్తున్నారు.

