కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక సమీక్ష నిర్వహించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, వరంగల్ ఎయిర్ పోర్టు పైన సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, TGIIC కమిషనర్ శశాంక, రంగా రెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి , ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పుణె రైల్వే మార్గం లో వికారాబాద్ అనంతగిరి దగ్గర స్టేషన్ ఏర్పాటు చేయాలన్న సీఎం.. అనంతగిరి నుంచి ఐటీ హబ్ కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్ టు బెంగళూరు హై స్పీడ్ రైల్వే లైన్ భారత్ ఫ్యూచర్ సిటీ లో స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మన్ననూర్ దగ్గర నల్లమల స్టేషన్, సోమశిల సమీపం లో స్టేషన్ ప్లాన్ చేయాలని సూచించారు. టూరిజం ప్రాంతాలను దృష్టి లో ఉంచుకొని రైల్వే లైన్ ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ (శంషాబాద్)ను బుల్లెట్ ట్రైన్ హబ్ గా పిలవాలని చెప్పారు.
మరోవైపు వరంగల్ ఎయిర్ పోర్ట్ డిజైన్ లపైన కూడా ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. కాకతీయ సామ్రాజ్యం వారసత్వ సంపద అడుగడుగునా ఉట్టి పడేలా వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం జరగాలని వెల్లడించారు. ఎయిర్ పోర్టు ముందు భారీ ఐలాండ్ ఉండాలని.. ఐలాండ్ లో రాణి రుద్రమ విగ్రహం ,రుద్రదేవుడు విగ్రహాలతో పాటు భారీ నంది విగ్రహం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ డిజైన్స్ పైన ఢిల్లీ వెళ్లి ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులతో చర్చలు జరపాలని సూచించారు.

