కలం, జగిత్యాల: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ధాన్యం మాయం చేసిన రైస్ మిల్లర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తుండటంతో సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పలు రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో మూడు మిల్లుల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు.
జగిత్యాలలో మూడు రైస్ మిల్లులో తనిఖీలు చేయగా.. రూ.87.89 కోట్లకు పైగా విలువైన ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తించారు. ఇలాగే కేసులు పెట్టారు. ఈ మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. తక్కల్లపల్లి శివారులోని మూడు రైస్ మిల్లులపై పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మూడు రైస్ మిల్లుల్లో..
అభయాంజనేయ సాయి ఇండస్ట్రీస్‌లో రూ.43.72 కోట్ల విలువైన ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. దీన్ని నడుపుతున్న కొండ లక్ష్మణ్, కొండ ప్రణీత్‌ను ఇందుకు బాధ్యులుగా గుర్తించారు. లక్ష్మి బాలాజీ ఇండస్ట్రీస్‌లో రూ.38.68 కోట్ల విలువైన ధాన్యం కొరత ఉండగా.. భాగస్వాములు కొండ ఉపేంద్ర, కొండ అరుణను బాధ్యులని వివరించారు.
లక్ష్మి గణపతి ఇండస్ట్రీస్‌లో రూ.5.48 కోట్ల విలువైన ధాన్యం మాయం కావడానికి సైతం కొండ అరుణ, కొండ ఉపేంద్ర కారణమని పేర్కొన్నారు. మూడు రైస్ మిల్లుల్లో కలిపి రూ.87.89 కోట్ల విలువైన మొత్తం 34 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించారు. ఆయా యాజమాన్యాలపై సంబంధిత చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

