కలం, జోగులాంబ గద్వాల : పిల్లల హక్కుల పరిరక్షణ, భద్రత కల్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal ) న్యాయ సేవా సంస్థ చైర్మన్ కళ్యాణ చక్రవర్తి అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నాల్స “పిల్లలకు అనుకూల న్యాయ సేవల పథకం–2024” పై చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల కోసం శనివారం గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఒక రోజు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాల్సా ప్రవేశపెట్టిన పిల్లలకు అనుకూల న్యాయ సేవల పథకం–2024 ద్వారా ప్రతి చిన్నారికి ఉచిత న్యాయ సహాయం, పిల్లలకు అనుకూలమైన న్యాయ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే వారికి చట్టాలపై అవగాహన, అవసరమైన కౌన్సెలింగ్, రక్షణ,పునరావాసం అందించడమే దీని లక్ష్యమన్నారు. పిల్లల గోప్యత, గౌరవం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత శాఖల సమన్వయంతో వారి శ్రేయస్సు కోసం ఈ పథకం పనిచేస్తుందని వివరించారు.
పోక్సో (POCSO) చట్టం–2012లో మొత్తం 46 సెక్షన్లు ఉన్నాయని, ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలుగా పరిగణించబడతారని తెలిపారు. పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడం, బాధితులకు న్యాయ పరిరక్షణ కల్పించడం, నేరస్థులకు కఠిన శిక్షలు విధించడమే పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తే ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని.. వేధింపులు, హింసకు గురవుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థి భద్రత, సంక్షేమంపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి విద్యాభ్యాసంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. పిల్లలపై జరిగే వేధింపులు,బాల్య వివాహాలు, బాల కార్మికత్వాన్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, ప్రతి చిన్నారికి సురక్షితమైన, వివక్షలేని వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం నాల్సా ప్రవేశపెట్టిన పిల్లలకు అనుకూల న్యాయ సేవల పథకం–2024, పోక్సో చట్టం, బాలల హక్కులు, బాల్య వివాహాల నివారణ,బాల కార్మిక నిర్మూలన, పిల్లల రక్షణపై అవగాహన కల్పించే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో స్పెషల్ సెషన్స్ న్యాయమూర్తి వి.శ్రీనివాస్,జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎ.నాగరాజు,జిల్లా విద్యా శాఖ అధికారి విజయ లక్షి, జిల్లా సంక్షేమ అధికారి సునంద, సీడీపీఓ ఆకాశ దీప్తి, ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

